కాంగ్రెస్ పార్టీలోకి దిండు ప్రవీణ్ గౌడ్
ఎల్బీనగర్, వాయిస్ టుడే: ఎల్బీనగర్ నియోజకవర్గం చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దిండు ప్రవీణ్ గౌడ్, ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిండు ప్రవీణ్ గౌడ్ కు కాంగ్రెస్ కండువా కప్పి మధుయాష్కిగౌడ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. విద్యార్థిని ప్రవళిక మరణం విషయంలో మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను మధుయాష్కి గౌడ్ ఖండించారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి సుపరిపాలన తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో కెసిఆర్ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీనిచ్చారు. అంతకుముందు పార్టీలో చేరిన మహిళలు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, లింగాల కిషోర్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ బద్దల వెంకటేష్ యాదవ్, గజ్జి శ్రీనివాస్ యాదవ్, బొంగు వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పార్వతి, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
