మల్లాపూర్ మండలంలో గుడుంబా బట్టిల ధ్వంసం
ఎక్సైజ్, పోలీస్ సంయుక్త దాడులు
తెలంగాణ రాష్ట్రాన్ని గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మల్లాపూర్ మండలం లోని వేంపల్లి వెంకటరావుపేట గ్రామంలో గుడుంబా దాడులు జరిగాయి. ఈ దాడులలో 250 లీటర్ల బెల్లం పాకం స్వాదీనం చేసుకొని, ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మెట్ పల్లి ఎక్సైజ్ సీఐ వినోద్ రాథోడ్ తెలిపారు. గుడుంబా తయారు చేసే సామాగ్రి తో పాటు 6 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. సిఐ వినోద్ రాథోడ్ మాట్లాడుతూ, గుడుంబా వల్ల కొన్ని కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నాశనమవుతున్నాయని, ఇట్టి గుడుంబా తయారిదారులకు గతంలో ప్రభుత్వం గుడుంబా తయారిని వదలాలని, వారికి స్వయం ఉపాధికై ఆర్ధిక సహాయాన్ని అందించిందని గుర్తుచేశారు. అయినా గుడుంబా తయారు చేస్తున్నారని అన్నారు. ఈ రోజుల్లో నూతన చట్టాలు వచ్చాయని, తప్పు చేసేవారిపై చట్టాలు అమలు జరుగుతాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో గుడుంబా తయారీదారులను, అమ్మకం దారులను, సరఫరాదారులను కట్టడి చేస్తామని, వీరిపై బైండోవర్ కేసు నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ దాడులలో ఎక్సైజ్ సీఐ వినోద్ రాథోడ్, మల్లాపూర్ పోలీస్ ఎస్ఐ కిరణ్, పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు