ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధి
– ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం,
Development of villages with public participationDevelopment of villages with public participation
ప్రభుత్వంలో నిధుల కొరత కారణంగా గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రజలందరూ సహకరించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పంచాయతీలు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, 14వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించడం గ్రామపంచాయతీల పాలిట శాపమైందన్నారు. పంచాయతీలో నిధులు లేక కనీస సౌకర్యాలు కల్పించలేక గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు దిష్టిబొమ్మలుగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాభివృద్ధికి ఎవరు ముందుకు వచ్చిన ప్రజలందరును భాగస్వాములను చేసి తాను కూడా భాగస్వామిని అవుతానని సొంత నిధులతో కొంతైనా అభివృద్ధి చేద్దామని తనకు సహకరించాలని ప్రజాప్రతినిధులను కోరారు. అధికారులందరూ కనీస అవసరాలు అయిన త్రాగునీరు, రోడ్లు వంటి అంశాలపై ముందు దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తమ సమస్యలను వివరించగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తాను శాసనసభ్యుడునైన తర్వాత అందరూ మంత్రుల చుట్టూ తిరిగితే తాను మాత్రం అధికారుల చుట్టూ తిరిగి ఇప్పటికే 20 కోట్ల వరకు నిధులు మంజూరు
చేయించానని తెలిపారు. హౌసింగ్ అధికారులపై ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మండలంలో ఏర్పాటు చేసిన 26 లేఅవుట్లలో జగనన్న కాలనీల పేరుతో స్థలాలు అందించి కనీస సౌకర్యాలను కల్పించకుండా ఏం చేశారని ఆయన నిలదీశారు. అధికారులందరూ స్వలాభం చూసుకోకుండా పనిచేయాలంటే ఇక్కడ పని చేయవచ్చునని లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అన్నారు. ఎస్ ఈ బి డిపార్ట్మెంట్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతున్న నేపథ్యంలో కేసులు నమోదు చేసి చేతులు దులుపుపోకుండా పూర్తిస్థాయి విచారణ జరిపి అమ్మిన వారిని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ అలసత్వం వల్ల యువకుల ప్రాణాలు సైతం బలవుతున్నాయని దీనికి పెంటపాడు లో జరిగిన ప్రమాదమే ఉదాహరణగాచెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ,దాసరి హైమావతి, ఇన్చార్జి ఎమ్మార్వో యూ వెంకటేశ్వర్లు, ఎండిఓ బాలాజీ, జడ్పిటిసి ఉప్పులూరు వరలక్ష్మి, ఎంఈఓ ఎం శ్రీనివాస్ ఏవో పార్థసారథి, ఎలక్ట్రికల్ ఏఈ పెద్దరాజు,తదితరులు పాల్గొన్నారు.