హైదరాబాద్ : ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) సీపీలు, ఎస్పీలతో డీజీపీ ఇవాళ . టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు. లెక్కింపు కేంద్రాల వెలుపల పటిష్ఠ నిఘా పెట్టాలని, కేంద్రాల లోపల సైతం దృష్టి సారించాలని అంజనీ కుమార్ సూచించారు. చివరి రౌండ్లలో ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎవరినీ గుమిగూడనివ్వొద్దని, పికెటింగ్ చేయడంతో పాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ప్రతీకారదాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులతో పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఎవరు గెలుపొందినా పోలీసులకు సహకరించేలా వివరించాలని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి విఘా లేకుండా ఎన్నికల బందోబస్తు నిర్వహించామని, ఈ రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండి ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సీపీలు, ఎస్పీలను అంజనీ కుమార్ ఆదేశించారు.