2014కు ముందు ప్రజలు మంచినీరు తాగలేదా?
మిషన్ భగీరథ వల్ల ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని మభ్యపెట్టారు
అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చారని కాగ్ చెప్పింది
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రేవంత్ రెడ్డి X హరీష్‌రావు మధ్య మాటల యుద్ధం
హైదరాబాద్ డిసెంబర్ 20
:: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరంపై వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. కొత్త సీఎంకు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశామన్నారు. ‘‘మీ విజ్ఞతను వినియోగించి సంపదను సమకూర్చుకోండి.. కానీ మా మీద నెపం నెట్టి తప్పించుకోకండి. రాష్ట్ర పరపతిని దిగజార్చకండి. రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయకండి’’ అంటూ హరీష్‌రావు హితవుపలికారు.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ‘‘2014నుంచి 16వరకు హరీష్ రావు నీటిపారుదుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్ళు వారి కుటుంబం తప్ప మరెవరు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు కాదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు రూ.97,449 కోట్లు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఖర్చు చేసింది. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014కు ముందు ప్రజలు మంచినీరు తాగలేదా? బీఆర్‌ఎస్ వచ్చాకనే మంచినీళ్లు తాగినట్లు చెబుతున్నారు. మిషన్ భగీరథ వల్ల ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని మభ్యపెట్టి లోన్లు తెచ్చారు. అప్పులు చేసిన విషయాన్ని అంగీకరించకుండా దబాయిస్తున్నారు. అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చారని కాగ్ చెప్పింది’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.