Saturday, February 15, 2025

పోలవరం ప్రాంతవాసులకు కష్టాలే..

- Advertisement -

పోలవరం ప్రాంతవాసులకు కష్టాలే..

Difficulty for the people of Polavaram region..

ఏలూరు, నవంబర్ 9, (వాయిస్ టుడే)
ఆ ఊరు దేశం యావత్తు ప్రజలకు తెలుసు.. పర్యాటకులు అక్కడి నుంచి లాంచీలు ఎక్కుతుంటారు. ప్రధాని నుంచి మంత్రుల వరకు అక్కడేం జరుగుతోందని ఆరా తీస్తుంటారు. వారం వారం ముఖ్యమంత్రి కూడా ఆ ఊరు విజిట్‌ చేస్తుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిరంతరం పర్యటిస్తుంటారు. ఇంత గొప్ప పేరున్న ఆ ఊరు చివరకు ఎటూ కాకుండా పోతుంది. వ్యాపారాల్లేవు. పనులు లేవు. అన్నీ వలసలే. బహుళార్ధ సాధక నీటి ప్రాజెక్టు ఆ ఊరి పేరు మీదే దేశవ్యాప్తంగా సుపరిచితం అయింది. అయితే ఏంటంటారా, పేరు గొప్ప ఊరు దిబ్బ అని అంటున్నారు ఆ ఊరు వాళ్ళు. ఆ ఊరే జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తున్న పోలవరం. పోలవరానికి అభివృద్ధి అందని ద్రాక్ష అయింది.పోలవరం ప్రాజెక్టుతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోయాయి. వందలాది ఎకరాలు భూసేకరణలో పోయింది. ఉపాధి కరువై పొట్ట చేత పట్టుకొని వలసలు పోవాల్సిన దుర్భర పరిస్థితులు దాపరించాయి. కూలి పనులు లేక పనులు కోసం పొరుగూళ్లకు పరిగెడుతున్నారు. పూట గడవని గట్టు పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యాపారాలు లేక దుకాణాలన్నీ వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితులకు తోడు ఆకాశాన్నంటుతున్న ధరలతో పేద,మధ్యతరగతి ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ప్రాజెక్ట్ తో పోలవరం ప్రాంత వాసుల ముఖ చిత్రాలు పూర్తి గా మారిపోతున్నాయి.లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది మంది ప్రజలకు తాగునీరు అందుతుందని, రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని ప్రాజెక్టును ప్రజలు స్వాగతించారు. ప్రాజెక్టు పూర్తయి పోలవరం అభివృద్ధి చెందుతుందని కలలుగన్నారు. కానీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు.. సరికదా పోలవరం ప్రాంతవాసుల జీవితాలలో కష్టాలు, కన్నీరు మిగిల్చింది. పోలవరం ప్రాజెక్టుతో ఏజెన్సీ గిరిజన గ్రామాలన్ని ప్రభుత్వం ఖాళీ చేయించింది. వేలాదిగా నిర్వాసితులు పునరావాసాలకు తరలివెళ్లిపోయారు. ఏజెన్సీలోని వందలాది ఎకరాల సాగులో లేకుండా ఉన్నాయి. ఈ ప్రభావం నేరుగా మండల కేంద్రం పోలవరం మీద పడి బతుకులకు భద్రత లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు, పట్టిసీమ ఎత్తిపోతలకు పథకానికి, ప్రాజెక్టులో వచ్చిన వ్యర్ధమైన మట్టిని డంప్ చేయడానికి, నిర్వాసితుల పునరావాస గ్రామాల నిర్మాణానికి వందలాది ఎకరాలను సేకరించింది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.వ్యవసాయ కూలీలకు పనులు సరిపడా లేకుండా పోయిందని కుంజం నాగబాబు, పెంటా పోసియ్య, ముళ్ల కేదరి, డేరా భద్రమ్మ, వల్లూరి సూర్యకుమారి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు, గ్రామాలు ఖాళీ చేసి పునరావాస గ్రామాలకు వేలాది మంది తరలిపోవడంతో అన్ని రకాల వ్యాపార దుకాణాలు కొనేవారు లేక వెలవెలబోతున్నాయి. దీనివల్ల వ్యాపారస్తులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని నాళం గాంధీ, మండవల్లి బాబ్జి, బెజవాడ రామకృష్ణ, కోరసిక నాగబాబు, భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్స్ పనులు కోసం రాజమండ్రి, కొవ్వూరు,తాడేపల్లిగూడెం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. రోజువారీ కూలీలు ఇప్పటికే ఊరు విడిచి పెట్టి, పొరుగుళ్ళ‌కు పొట్ట చేత పట్టుకుని వలస పోతున్నారని ప్రజలు వాపోయారు. వారం వారం జరిగే సంత కూడా జనాలు లేక బోసిపోతోంది. ఇప్పటికైనా పాలకులు పోలవరం ప్రజలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వీరి జీవన ప్రమాణాలు పెంచి అభివృద్ధి చెయ్యాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్