- Advertisement -
టీడీపీలో జగన్ పై చర్చోపచర్చలు
Discussions on Jagan in TDP
కాకినాడ, ఫిబ్రవరి 8, (వాయిస్ టుడే)
సీపీ అధినేత వైఎస్ జగన్ ను తక్కువగా అంచనా వేయడం ఎంత మాత్రం తగదని టీడీపీ సీనియర్ నేతలు సూచిస్తున్నారు. జగన్ మీద కేవలం విమర్శలు చేస్తే సరిపోదని తాము చేసిన అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కూడా చెబుతున్నారు. జగన్ అండర్ ఎస్టిమేట్ వేస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలియంది కాదు. జగన్ ను సాదాసీదాగా వదిలేసే నేత మాత్రం కాదు. జగన్ అన్ని రకాలుగా బలంగానే ఉన్నారు. గత ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసినా నలభై శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయంటే ఎంత స్ట్రాంగ్ గా నియోజకవర్గాల్లో పాతుకు పోయారో వేరే చెప్పాల్సిన పనిలేదు.నిజానికి జగన్ బలం లీడర్లు కాదు. క్యాడర్. ఓటు బ్యాంకు. జగన్ కు ఇప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక మైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకున్నారు. 2014 నుంచి ఆ ఓటు బ్యాంకు చెక్కు చెదరడం లేదు. పైగా పెరగడమే తప్పించి తగ్గడం అనేది జరగదన్నది కూటమి నేతలకు తెలియంది కాదు. నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉండటంతో పాటు నేతలు కూడా ఉన్నారు. ద్వితీయ శ్రేణి నేతలు కూడా బలవంతులైన వారు న్నారు. సామాజికవర్గం పరంగానూ, ఆర్థికంగానూ బలమైన నేతలుండటం ఫ్యాన్ పార్టీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అంతే తప్ప అలా గాలికి వచ్చి ఇలా వెళ్లిపోయే నేత కాదన్నది చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే జగన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.. తమ పార్టీలకు చెందిన ఓటు బ్యాంకు ప్రతి ఎన్నికల్లో మారుతుంటుంది తప్పించి జగన్ ది స్ట్రాంగ్ అయిన ఓటు బ్యాంకు. రాజశేఖర్ రెడ్డి ఏర్పరచిని ఓటు బ్యాంకును కొల్లగొట్టడమంటే అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలుసు. అదే సమయంలో బేస్ లెవెల్లో కరుడు కట్టిన కార్యకర్తల బలం కూడా అదనం కావడంతో పాటు జగన్ ఆర్ధికంగా బలవంతుడు కావడంతో ఏ ఎన్నికల్లోనైనా ఎదుర్కొనడం అంత సులువు కాదు. అందులోనూ ఒంటరిగా పోటీ చేసి గెలుపొందడం సాధ్యం కాదన్నది ఇటు చంద్రబాబుకు, అటు పవన్ కల్యాణ్ కు తెలియంది కాదు. జగన్ అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి కూటమి ని కంటిన్యూ చేయడం తప్ప మరోదారి వారికి లేదు. అందుకే జగన్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదని సీనియర్ నేతలు పదే పదే చెబుతున్నారు. జగన్ కు ఉన్న ఇమేజ్ ను కూడా తగ్గించాలనుకోవడం వృధా ప్రయాసే అవుతుందని, అందువల్ల మొన్నటి ఎన్నికల్లో పోలయిన ఓట్లు పక్కకు పోకుండా చూసుకోవడం, కూటమి పార్టీ క్యాడర్ ను కలసికట్టుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుందన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా వినిపిస్తుంది. అందుకే జగన్ పై చేసే వ్యతిరేక ప్రచారంతో పాటు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సీనియర్ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. సోషల్ మీడియా ను కూడా మరింత బలోపేతం చేయలేకపోతే అభాసు పాలు కాకతప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అందుకే వరసగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సిట్ లను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
- Advertisement -