నదీ జలాలను కలుషితం చేయొద్దు
Do not pollute river waters
జన విజ్ఞాన వేదిక పిలుపు
శ్రీకాకుళం
ఉత్తరాంధ్ర పర్యావరణ అధ్యయన యాత్ర లో భాగంగా ఈరోజు జనవరి 11న జన విజ్ఞాన వేదిక శ్రీకాకుళం జిల్లా పర్యావరణ సబ్ కమిటీ శ్రీకాకుళం నగరంలోని నాగావళి నది పరివాహక ప్రాంతాలను సందర్శించింది.
శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం కొత్త బ్రిడ్జి వద్ద నగరంలోని మురికి నీరు ఏ విధంగా నాగావళి నది లోకి ప్రవహిస్తున్నది, నదీ జలాలను ఏ విధంగా కలుషితం చేస్తున్నది జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పరిశీలించారు.
అదేవిధంగా పాత బ్రిడ్జి వద్ద కోటీశ్వరాలయం వద్ద గల నదీ పరివాహక ప్రాంతంలో నగరంలోని చెత్తాచెదారం ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోయి నది జలాలు ఏ విధంగా కలుషితం అవుతున్నది జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పరిశీలించారు.
ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ గౌరవ జిల్లా కలెక్టర్ ,నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని మురికి నీరు, చెత్తాచెదారాలు నదీ జలాల్లోకి చేరకుండా చర్యలు చేపట్టాలని , మురికి నీటిని శుద్ధి చేసిన తర్వాత మాత్రమే నదీ జలాల్లో విడుదల చేసేలా చూడాలని కోరారు.
ప్రజానీకం పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ స్పృహ కలిగి ఉండాలని, మన పరిసరాలను మనమే రక్షించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు, పర్యావరణ సబ్ కమిటీ జిల్లా కన్వీనర్ పూజారి గోవిందరావు లు మాట్లాడుతూ పర్యావరణహిత ఆరోగ్య సమాజం నిర్మాణంలో ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని కోరారు.
విద్య సబ్ కమిటీ జిల్లా కన్వీనర్ పాలవలస ధర్మారావు, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా కార్యదర్శి చింతాడ కృష్ణారావు లు మాట్లాడుతూ నదుల స్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో బాటు, ప్రజలది కూడా అని తెలిపారు.
పర్యటనలో జన విజ్ఞాన వేదిక సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ అగతమూడీ వాసుదేవరావు, పర్యావరణ సబ్ కమిటీ నాయకులు పి జగదీశ్వరరావు, చమళ్ళ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.