మెదక్, ఆగస్టు 18 : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మార్పుపై మరోమారు చర్చ జరుగుతుంది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో, జగ్గారెడ్డికి ఉన్న విబేధాలతో గత కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు జగ్గారెడ్డి. అయితే కొన్ని రోజులుగా జగ్గరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగ్గారెడ్డి, కేటీఆర్‌ని కలవడంతో ఆయన బీఆర్ఎస్‌లో చేరడం పక్కా అని జోరుగా ప్రచారం జరుగుతోంది. జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లోకి వస్తాడు అని జరుగుతున్న ప్రచారాలతో సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలు అలెర్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితిలో జగ్గరెడ్డిని బీఆర్ఎస్ లోకి రానివ్వద్దని కార్యకర్తలు, నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయంపై గత నెలలో కూడా నియోజకవర్గ నేతలు అందరూ కలిసి ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.అయితే, రెండు రోజులుగా బీఆర్ఎస్‌లోకి జగ్గారెడ్డి చేరడం పక్కా అని వస్తున్న వార్తలతో మరోసారి అలెర్ట్ అయ్యారు సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలు. నిన్న సుమారు 200 మంది నేతలు, కార్యకర్తలు కలిసి హైదరాబాద్‌లో ఉన్న జిల్లా మంత్రి హరీష్ రావు వద్దకు వెళ్లారు. మంత్రి హరీష్ రావును కలిసి జగ్గరెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవద్దని వినతిపత్రం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చింత ప్రభాకర్‌కే టికెట్ ఇవ్వాలని, పోయిన ఎన్నికల్లో కూడా అతి తక్కువ మెజార్టీతో చింత ప్రాభకర్ ఓడిపోయారని గుర్తు చేశారు. ఈసారి ఎలాగైనా గెలిపించుకుంటామని, ఎట్టి పరిస్థితిలో జగ్గరెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవద్దు అని మంత్రి హరీష్ రావుని కలిసి విన్నవించారు సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలు.వీరి మాటలు విన్న మంత్రి హరీష్ రావు కూడా సానుకూలంగానే స్పందించారని సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానంటూ సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలకు హామీ కూడా ఇచ్చారని సమాచారం. మరోవైపు బీఆర్ఎస్‌లోకి జగ్గరెడ్డి రాకను సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు అందరూ వ్యతిరేకిస్తున్నారు. జగ్గారెడ్డి నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ఉండడని, తాను ఎమ్మెల్యేగా ఉనప్పుడు కూడా నియోజకవర్గానికి చేసింది కూడా ఏమి లేదని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం ఉన్నా కనీసం ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండడని అంటున్నారు. అంత పెద్ద కరోనా వచ్చి నియోజకవర్గ ఎంతోమంది ఇబ్బందులు పడ్డా కూడా ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి అందుబాటులో లేకపోవడం ఒక్కటి చాలు నిదర్శనంగా చెప్పుకోవడానికి అని అంటున్నారు. ఒక వేళ బీఆర్ఎస్ టికెట్ జగ్గారెడ్డికి ఇస్తే ఇక్కడ బీఆర్ఎస్ ఓటమి పక్కా అంటున్నారు సొంత పార్టీ నేతలు.
ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకున్నా చింత ప్రభకర్ నియోజకవర్గ ప్రజలకు, నేతలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉన్నాడని, ఆయనకే మళ్ళీ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒక వేళ తమ పార్టీలోనే ఇంకా ఎవరైనా టికెట్ కావాలని అడిగితే, వాళ్ళ కాళ్ళు మొక్కి అయినా సరే వారిని బుజ్జగించి.. చింత ప్రభకర్ కే టికెట్ వచ్చేలా చేసుకుంటాం అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగ్గరెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్లు మట్లాడాడని, అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ లోకి ఎలా తీసుకుంటారని ప్రశిస్తున్నారు సంగారెడ్డి బీఆర్ఎస్ నేతలు.ఇదిలాఉంటే.. జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం భారీగా జరుగుతున్నా.. ఇప్పటి వరకు దానిపై జగ్గారెడ్డి స్పందించకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. చూడాలి మరి సంగారెడ్డి బీఆర్ఎస్ నేతల పంతం నెగ్గుతుందా? లేక జగ్గారెడ్డిని పార్టీలోకి చేర్చుకుని, అధిష్టానం స్థానిక నేతలను కూల్ చేస్తుందా? ఎక్కడి వరకు వెళ్తుందో ఈ మ్యాటర్ అనేది సంగారెడ్డిలో ఇంట్రస్టింగ్‌గా మారింది.