
మధుయాష్కికి సీనియర్లు సహకరిస్తారా?
ఎల్బీనగర్, వాయిస్ టుడే ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన మధుయాష్కిగౌడ్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం మధుయాష్కిగౌడ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్ రెడ్డి రాంరెడ్డి, మిద్దెల జితేందర్, కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ లు ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు. ఎల్బీనగర్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన అభ్యర్థులను కాదని, పార్టీ అధిష్టానం నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ కి టికెట్ ను కేటాయించడంతో ఆశావాహుల్లో నిరాశ మొదలైంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన తమను కాదని మధుయాష్కిగౌడ్ ని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించడంతో సీనియర్లు మధుయాష్కిగౌడ్ కి సహకరిస్తారా? లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సీనియర్లను కలుపుకుపోతారా?
ఎల్బీనగర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న సీనియర్లను కాదని ముందుకు వెళితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ కి నష్టం జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న మధుయాష్కిగౌడ్ నియోజకవర్గంలో ఉన్న సీనియర్లందరులందరినీ కలుపుకొని ముందుకెళ్తే ఆయన గెలుపు సులభతరం అవుతుందని మరికొందరు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో ఉన్న సీనియర్లను మధుయాష్కిగౌడ్ కలుపుకొని ముందుకెళ్తారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదీఏమైనా మధుయాష్కిగౌడ్ తీసుకునే నిర్ణయంపై సీనియర్లు సహకరించేది, లేనిది తేటతెల్లమవుతుంది. ఈ విషయంలో పార్టీ అధిష్టానం మధుయాష్కి గౌడ్ గెలుపుకు సహకరించాలని సీనియర్లతో చర్చించి, బుజ్జగిస్తే ఇక్కడి సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిమాణాలు నెలకొంటాయో వేచి చూడాల్సిందే.