వైద్యులు తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి
గర్భిణీ స్త్రీలకు మరింత మెరుగ్గా 102 సేవలు అందించాలి
ఆసుపత్రి పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత
ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలి
పెద్దపల్లి మాతా శిశు సంరక్షణ కేంద్రం, గోదావరిఖని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి
Doctors should perform their duties strictly
ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేసే వైద్యులు తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, డ్యూటీ టైం లో పూర్తి స్థాయిలో ఆసుపత్రిలోనే ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించా రు. గురువారం జిల్లా కలెక్టర్
కోయ శ్రీ హర్ష పెద్దపల్లి పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, గోదావరిఖని ఏరియా ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ ను కలెక్టర్ పరిశీలించారు.
ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సేవలు, 102 సర్వీస్ సేవలు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పౌష్టికాహారం, తీసుకోవాల్సిన మందుల పై ఫాలో అప్ చేస్తున్నారా వంటి పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్లు వైద్యులను కలిసి, అవసరమైన పరీక్షలు చేయించుకుని మందులు తీసుకుని త్వరగా వెళ్ళె విధంగా చర్యలుతీసుకోవాలని ఆసుపత్రి సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో లేబర్ వార్డ్, ఆపరేషన్ థియేటర్ , జనరల్ వార్డులకు కేటాయించిన వైద్యులు సదరు విధులు నిర్వహించిన తర్వాత ఔట్ పేషంట్ల ను కూడా చూడాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ కు వెళ్లే అవసరం, అవకాశం కల్పించ వద్దని, ప్రభుత్వ రంగంలో అత్యధిక ప్రసవాలు జరిగే విధంగా చూడాలని అన్నారు. గర్భిణీ స్త్రీలకు అందించే102 అమ్మ ఒడి వాహన సేవలను మరింత మెరుగ్గా అందించాలని అన్నారు. ఆసుపత్రిలో ప్రత్యేక నవ జాతు శిశువు సంరక్షణ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. కొత్తగా పుట్టిన శిశువు అవసరమైన ప్రత్యేక మందుల జాబితా అందిస్తే వాటిని సిద్ధం చేస్తామని కలెక్టర్ తెలిపారు.ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న టిఫా స్కానింగ్ యంత్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, అవసరమైన ప్రతి
గర్భిణీ మహిళకు తప్పనిసరిగా టిఫా స్కానింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఆసుపత్రిలో గైనకాలజిస్టులు, చిన్నపిల్లల వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, డ్యూటీ పీరియడ్ లో పూర్తి స్థాయిలో ఆసుపత్రిలోనే అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలు, ప్రాంగణం పరిశుభ్రంగా ఉండాలని, పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ అన్నారు. ఎంసిహెచ్ పారిశుధ్య నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్ కు వెంటనే నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోదావరిఖని లోని ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ పరిశీలించారు . ఆసుపత్రిలోని జనరేటర్ మరమ్మత్తు, ఆసుపత్రిలో అవసరమైన రిన్నోవేషన్ పనులకు ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ టిఎస్ఎంఐడిసి అధికారులకు సూచించారు. ఆస్పత్రి వద్ద నిర్మించిన అదనపు పడకల బ్లాక్ కు నీటి సమస్య పరిష్కారానికి ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రిలోని ప్రతి వార్డును తనిఖీ చేసిన కలెక్టర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.
ఈ తనిఖీలలో జిల్లా కలెక్టర్ వెంట గోదావరిఖని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, పెద్దపల్లి సివిల్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ రవీందర్ ,నర్సింగ్ సూపర్డెంట్, క్వాలిటీ మేనేజర్ అనిల్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.