రేపటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం
Dokka Seethamma midday meal for intermediate students from tomorrow
విజయవాడలో లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి లోకేష్
రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.
ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్యకు మంత్రి లోకేష్ చర్యలు
అమరావతి:
రాష్ట్రంలో గత అయిదేళ్ల అస్తవ్యస్త పాలనలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలకు కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది రూ.27.39 కోట్లు. వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85.84 కోట్లు ఖర్చుచేయనున్నారు. మంత్రి లోకేష్ ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.