రాజకీయాలు కాదు.. మొత్తం ఆయనే చేశారు
విశాఖపట్టణం, సెప్టెంబర్ 9: రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించామన్న ఆరోపణలను మంత్రి గుడివాడ అమర్నాథ్ తోసిపుచ్చారు. కక్ష సాధింపు ఉద్దేశం ఉంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేసేవాళ్లమన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో పక్కా సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నందునే చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. చంద్రబాబుపై ప్రేమతో ఆయన అవినీతికి సంబంధించిన ఆధారాలను పవన్ కల్యాణ్ చూడలేకపోతున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసు, అమరావతి రియల్ ఎస్టేట్ స్కామ్.. ఇలా చంద్రబాబు నాయుడు చేసిన స్కాంలు చాలా ఉన్నాయన్నారు. కేంద్ర పరిధిలోని ఈడీ సంస్థ నోటీసు ఇచ్చిన కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేస్తే పురందేశ్వరికి ఉలుకెందుకని ప్రశ్నించారు.చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్, అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అంటూ మంత్రి అమర్ ధ్వజమెత్తారు. సీమెన్స్ అనే సంస్థ పేరు వాడుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారని ధ్వజమెత్తారు. ఈ కేసులో 8 మందిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిందని గుర్తు చేశారు. ఈ స్కాంలో పాత్రదారులు ఎందరు ఉన్నా.. సూత్రధాని మాత్రం చంద్రబాబేనని ఆరోపించారు.యూరో లాటరీ పేరుతో అమాయక ప్రజలను ఎలా మభ్య పెట్టి మోసం చేస్తాయో.. అదే మోడస్ ఆపరెండీని చంద్రబాబు ఈ కేసులో వాడారని ధ్వజమెత్తారు.చంద్రబాబు చేసిన ఆర్థిక నేరాలకు అరెస్టు చేయక.. సినిమాలు చూపిస్తారా? అంటూ ప్రశ్నించారు. అవినీతి కేసులో అరెస్టై సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. చేసిన అవినీతికి చంద్రబాబుకు శిక్ష తథ్యమన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌ను పురందేశ్వరి ఖండించడం అందుకే.. మంత్రి కాకాణి
ముందు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో జరిగిన మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అవినీతిలో పాలుపంచుకున్న అందరూ బయటకు వస్తారని వ్యాఖ్యానించారు. రూ.371 కోట్ల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారని అన్నారు. అణా పైసలుతో సహా బైటపడడంతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు ఏమి స్వాతంత్ర్య సమర యోధుడు కాదన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. అక్రమాలు, ధనార్జన ధ్యేయంగా చంద్రబాబు పని చేశారని ధ్వజమెత్తారు.2014, 2019 ఎన్నికల్లో పురందేశ్వరి ఓడిపోవడంతోనే ఇప్పుడు టీడీపీ మద్ధతుతో ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారని.. అందుకే చంద్రబాబు అరెస్ట్‌ను అమె ఖండిస్తున్నారని కాకాణి అన్నారు. చంద్రబాబు, పురంధేశ్వరికి మధ్య ఆ మేరకు ఒప్పందం కుదిరింది కాబట్టే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు.
చంద్రబాబు పాపం పండింది.. మంత్రి జోగి రమేష్
ఎప్పుడో అరెస్టు కావలసిన చంద్రబాబు నాయుడు ఈరోజు అరెస్ట్ కావటంతో అతని పాపం పడిందని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన కారకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్టుపై మంత్రి జోగి రమేష్ ఒక వీడియో విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ఈ రాష్ట్రానికి శుభ పరిమాణమని అభిప్రాయపడ్డారు. ఇన్ని వందలు వేలు కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే విషయమన్నారు.