మనోహర్ నేతృత్వంలో జనసేన కమిటీ
విజయవాడ, సెప్టెంబర్ 17, (వాయిస్ టుడే ): ఎవరూ ఊహించని విధంగా రాజమండ్రిలో టీడీపీ, జనసేన పొత్తుపై సంచలన ప్రకటన చేసిన పవన్ కల్యాణ్… దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. శనివారం మంగళగిరిలో పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన జనసేనాని..కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేసే టైంలో ఎవరూ ఇగోలకు పోవద్దని నేతలకు సూచించారు. వైసీపీ ప్రభుత్వానికే ఆరు నెలలే టైంలో ఉందని ఆ తర్వాత వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వమే అన్నారు పవన్. ముందు కష్టపడి పని చేద్దామన్న జనసేనాని.. పదవులు గురించి తర్వాత ఆలోచిద్దామని హితబోధ చేశారు. కలసి పనిచేస్తేనే వైసీపీ తరిమికొట్టగలమని అన్నారు. ఇక్కడ ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ కాదని హితబోధ చేశారు.తెలుగుదేశంతో సమన్వయ కోసం జనసేన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ స్పీకర్, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ అయిన నాదెండ్ల మనోహర్‌కు సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించారు. నాదెండ్ల మనోహర్‌కు ఉన్న అనుభవం ఇలాంటి సమయంలో పనికి వస్తుందన్నారు పవన్. జనసేన ఎన్డీఏలో భాగమైనప్పటికీ రాష్ట్రంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు పవన్ కల్యాణ్. ఎలాంటి పరిస్థితిలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో జగన్ చేస్తున్న అరాచకాలేంటో ప్రజలకు బలంగా చెప్పాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
2024లో కచ్చితంగా అధికారంలో భాగం కాబోతున్నామని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. బీజేపీ ఆశీస్సులతో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. షేరింగ్ విషయంలో సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందామని చెప్పారు. అంతా ఏకమై ఎదురిస్తున్నప్పుడు వైసీపీ లీడర్లు రెచ్చగొడతారని హెచ్చరించారు. వాళ్లు ఎంత రెచ్చగొట్టి మాట్లాడినా ఎవరు గొడవలు పెట్టుకోవద్దని సూచించారు. ఫోకస్ అంతా విజయంపై మాత్రమే ఉండాలన్నారు.రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితల గురించి వివరించేందుకు ఢిల్లీ వెళ్తానన్నారు. టీడీపీతో పొత్తు అంశాన్ని అమిత్ షా, జేపీ నడ్డాకు వివరిస్తానని, పొత్తు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో తెలియజేస్తానని పవన్ అన్నారు. రాష్ట్రంలో అక్రమ అరెస్ట్‌లు జరుగుతున్నాయని, వాటిని వారి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎన్డీఏ కూటమిలో తాము ఉన్నామని, పొత్తు అంశాన్ని వారికి వివరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇండియా భారత్ పేర్ల మార్పుపై దేశమంతా చర్చించుకుంటున్నారని, ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉందన్నారు. బ్రిటీష్ వారికి భారత్ అని నోరు తిరగక ఇండియా అని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
‘పరిస్థితుల దృష్ట్యా సనాతన ధర్మం మారుతుంది’
తాను ఎప్పుడు భారతీయుడిగానే మాట్లాడుతానని, 389 మంది మేధోమథనం చేయడం వల్ల మన రాజ్యాంగం వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలని, సనాతన ధర్మం, తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తోందని పవన్ అన్నారు. కాలం, అవసరాలు, పరిస్థితుల మేరకు సనాతన ధర్మం మారుతుందని, ద్వేషం, దోపిడీ కొంతకాలమే ఉంటాయని అన్నారు. ధ్వేషంతో కూడిన వాదనలు కచ్చితంగా కనుమరుగవుతాయని, మార్పును అంగీకరించి, ధర్మాన్ని పాటించి ప్రేమతో ముందుకొచ్చే వ్యక్తులే సమాజానికి దిశా నిర్దేశం చేయగలుగుతారని అభిప్రాయపడ్డారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్లే దేశంలో ఏకత్వం నిలబడింది.