హైదరాబాద్, నవంబర్ 15, (వాయిస్ టుడే): తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు రాష్ట్రంలోని పలు పార్టీలు ఫిర్యాదులు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ యాడ్స్ నిలిపి వేయాలని సీఈఓ వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ ఫిర్యాదులు చేయగా.. మూడు ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రకటనలను ఎన్నికల కమిషన్ నిలిపి వేసింది. ఇప్పటికే బీజీపీ 5, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 ప్రకటనలను ఈసీ నిలిపివేసింది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి ప్రశాంత ఎన్నికల వాతావరణాన్ని చెడగొడుతున్నారని రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.ఇక, బీఆర్ఎస్ అభ్యర్థులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సైతం ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు సరిగ్గా లేవని జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ మరో కంప్లైంట్ చేశారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు సక్రమంగా లేవని బీఎస్పీకి చెందిన ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఆర్వోలు సైతం తిరస్కరించారు.అయితే, నామినేషన్ పత్రాల్లో తప్పులు ఉన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు నోటీసులు కూడా ఇవ్వకుండా ఆర్వోలు అప్రూవల్ చేశారని పలు ఫిర్యాదులు చేశారు. ఆర్వోలు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని సీఈఓ వికాస్ రాజ్ కు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ప్రజాశాంతి, స్వతంత్ర అభ్యర్ధులు ఫిర్యాదు చేశారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సీఈవో వికాస్ రాజ్ ఆఫీస్ చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్తమని పలువురు అభ్యర్థులు వెల్లడించారు. గుర్తుల కేటాయింపుపై ఇప్పటికే సీఈసీకి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది.