కాంగ్రెస్ నేతలపై ఈడీ చార్జీషీట్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16, (వాయిస్ టుడే)
ED chargesheet against Congress leaders
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలకు ఈడీ షాకిచ్చింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌ను విచారించాలా లేదా అన్న విషయంపై ఈనెల 25వ తేదీన కోర్టు నిర్ణయిం తీసుకుంటుంది. ఇప్పటికే ఢిల్లీ , లక్నో , ముంబై లోని నేషనల్ హెరాల్డ్ ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. రూ. 700 కోట్ల ఆస్తులను సీజ్ చేయడానికి నోటీసులు అంటించారు.నేషనల్ హెరాల్డ్ కేసులో 2021 నుంచి ఈడీ విచారణ జరుగుతోంది. ఛార్జ్‌షీట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలు సుమన్ దూబే , శ్యామ్ పిట్రోడా పేరును కూడా చేర్చారు. సోనియా, రాహుల్‌పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. యంగ్ ఇండియా కంపెనీతో రూ.2000 కోట్ల నేషనల్ హెరాల్డ్ ఆస్తులను లాక్కునే కుట్ర జరిగిందని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌పై కాంగ్రెస్ న్యాయ సలహాలను తీసుకుంటోంది. నేషనల్ హెరాల్డ్ కేసు డైయిరీ వివరాలు ఇవ్వాలని ఈడీని కోర్టు ఆదేశించింది. ఈడీ ఛార్జ్‌షీట్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ , అమిత్‌షా బెదిరింపు రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్. కాంగ్రెస్ నాయకత్వం ఈ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఆస్తుల స్వాధీనం పెద్ద కుట్ర అని ఆరోపించారు.మరోవైపు గుర్‌గ్రామ్ భూముల కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా. గతంలో గురుగ్రామ్‌లో మూడున్నర ఎకరాల భూమిని రాబర్ట్ వాద్రా ఏడున్నర కోట్ల రూపాయలకు కొని, 58 కోట్లకు DLFకు అమ్మేశారు. ఈ వ్యవహారంలో 51 కోట్ల రూపాయల లబ్ధి వాధ్రాకు చేకూర్చినట్లు ED ఆరోపించింది. ఈ కేసులో ఈనెల 8న విచారణకు గైర్హాజరయ్యారు వాద్రా. దీంతో మరోసారి నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారని వాద్రా ఆరోపించారు. ప్రజల తరపున నేను మాట్లాడిన ప్రతీసారి తన గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. ED అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పినట్టు తెలిపారు.