Friday, June 20, 2025

పోడు రైతుల భూములు రక్షణకు కృషి :అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ

- Advertisement -

పోడు రైతుల భూములు రక్షణకు కృషి

అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ

జయశంకర్ భూపాలపల్లి,

పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, వారి ఉపాధికి భంగం కలగకుండా అటవీశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోడు భూముల రక్షణకు కృషి చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో పోడు భూముల్లో సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాలు సున్నితమైన పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దనీ, క్రమశిక్షణా చర్యలకు గురికావద్దని మంత్రి సురేఖ సూచించారు.   శనివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యల పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్, అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, డిప్యూటీ సెక్రటరీ శ్రీలక్ష్మి,  పిసిసిఎఫ్ డోబ్రియాల్, సిసిఎఫ్ లు భీమా నాయక్, ప్రభాకర్, డిఎఫ్ఓలు రాహుల్ కిషన్ యాదవ్, కిష్టాగౌడ్, సిద్దార్థ్ విక్రంసింగ్, విశాల్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.
పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతుల హక్కులను కాపాడడంలోనూ, అటవీశాఖ భూములను కాపాడే విధులను నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నదని మంత్రి సురేఖ అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏళ్ళుగా పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలకు, చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకున్నట్లైతే కఠినచర్యలు చేపట్టాల్సి వస్తుందని మంత్రి సురేఖ హెచ్చరించారు. నిన్న నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్ఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ ల పై గిరిజనులు చేసిన దాడిని మంత్రి సురేఖ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, రాష్ట్ర అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణకు అంతే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.  బిఆర్ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూముల కేటాయింపు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీ పై నివేదికను సమర్పించాలని మంత్రి సురేఖ అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, “ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం వెదకాలని మంత్రి సీతక్క నాతో పలుమార్లు ప్రస్తావించారు. పోడు భూముల విషయంలో అటవీశాఖకు, రైతులకు మధ్య జరుగుతున్న సంఘర్షణలను నివారించేలా చర్యలు చేపట్టాలని, మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ వచ్చారు. వీరి మధ్య జరిగే సంఘర్షణలతో ప్రభుత్వానికి మచ్చ రావద్దనే ఆలోచనతో ఈ సమస్యలకు పరిష్కారం వెదికేందుకు ప్రాథమికంగా నేడు సమావేశమయ్యాం. ఏళ్ళుగా కొనసాగుతున్న పోడు భూముల చిక్కు సమస్యను పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశాన్ని ప్రాథమిక సమావేశంగా భావిస్తున్నాం ” అని తెలిపారు.
తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పోడు భూముల పై వివాదాలను చూస్తూనే ఉన్నానని మంత్రి సీతక్క అన్నారు. అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అటవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఏళ్ళుగా కొనసాగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని మంత్రి కొండా సురేఖను మంత్రి సీతక్క కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలులో అటవీశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారుతున్న నేపథ్యంలో ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశాల్లో పోడు భూముల సమస్యను లేవనెత్తి, కచ్చితమైన పరిష్కారాన్ని రాబట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల విషయంలో అటవీశాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అటవీ భూములను కాపాడుకుంటూనే, పోడు రైతులకు ప్రయోజనం కలిగేలా పోడు భూముల్లో ఉద్యానవన శాఖ మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టి వారికి ప్రయోజనాలను కలిగించాలని కోరారు.  ఫారెస్ట్ డెవలప్ మెంట కార్పోరేషన్ ఆధ్వర్యంలో పలు రకాల మొక్కలను పెంచడం, పామాయిల్ చెట్లను సాగు చేయడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా పోడు రైతులకు ప్రయోజనాలను కలిగిస్తూనే ప్రభుత్వ లక్ష్యాలను సాధించవచ్చునని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఛత్తీసగఢ్ నుంచి రాష్ట్రంలోని వస్తున్న గిరిజనులు అటవీ భూములను ఆక్రమించుకుంటున్న విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. దీనికి మంత్రులు స్పందిస్తూ, “ పక్క రాష్ట్రాల నుంచి గిరిజనులు మన ప్రాంతానికి వస్తే ఇక్కడ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి. భవిష్యత్ లో ఇలాంటి వలసలు కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలి. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలి” అని అధికారులను ఆదేశించారు.
భూ ఆక్రమణలను వందకు వందశాతం నిలువరిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు వందకు వంద శాతం కొనసాగేలా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. అటవీశాఖ తమ భూములను లాక్కుంటుందనే పోడు రైతుల భ్రమలను తొలిగించేలా వారిలో నమ్మకాన్ని కలిగించేలా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గిరిజన సంక్షేమ శాఖలతో నిరంతరం చర్చిస్తూ, సమావేశమవుతూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేలా   కార్యాచరణను అమలుపరచాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు మంత్ర సురేఖ సూచించారు. పోడు భూములతో ముడిపడి ఉన్న అన్ని శాఖలను నిరంతరం సమీక్షిస్తూ ఈ దిశగా కచ్చితమైన మార్గదర్శకాలకు త్వరలో రూపం ఇవ్వాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఈ వర్షాకాలంలో పచ్చదనం పెంపుదలలో భాగంగా చేపట్టాల్సిన కార్యకలాపాల పై అధికారులకు మంత్రి సురేఖ పలు సూచనలు చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్