హైదరాబాద్, అక్టోబరు 19, (వాయిస్ టుడే ): తెలంగాణ విషయంలో మొదటి ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని అభిప్రాయపడ్డారు బీఆర్‌ఎస్‌ఎమ్మెల్సీ కవితమొదటి నుంచి తెలంగాణకు అన్యాయం చేసిన పార్ట ఏదైనా ఉందంటే కాంగ్రెస్ మాత్రమే అన్నారు. తెలంగాణను ఏపీలో కలపడం నుంచి అనేక మంది అమరులను బలి తీసుకుందని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేడు ఎన్నికల సమయంలో వచ్చి అన్నీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని అభిప్రాయపడ్డారు. వరంగల్ టూర్‌లో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గా ఆర్మూర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కవిత. కాంగ్రెస్ చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి కారణంగానే చాలా ప్రాజెక్టులు ఏళ్ల తరబడి ఆగిపోయాయని గుర్తు చేశారు. అలాంటి వాటిని గుర్తించి పూర్తి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని వివరించారు. ఆర్మూర్‌లో తాను చెపట్టిన ఇరిగేషన్ పనులను మీడియాకు వివరించారు.
నిండు వేసవిలో కూడా తెలంగాణలోని చెరువులు కళకళలాడుతున్నాయంటే తమ పాలనే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం నాడు ఏపీలో కలవడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానంగా ఉందన్నారు కవిత. తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి కాలయాపన చేశారని మండిపడ్డారు. దీని కారణంగా అమాయకులైన ప్రజలు ప్రాణాలు తీసుకున్నారని గుర్తు చేశారు. చివరకు కేసీఆర్ కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడితే తప్ప తెలంగాణ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అలా ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిపై విమర్శలు ఏంటని కోప్పడ్డారు. కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలను తెలంగాణ సమాజం హర్షించదని అభిప్రాయన్ని వ్యక్తం చేశారు కవిత. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే మరింత అభివృద్ధి దిశలో దూసుకువెళ్లేవాళ్లమని చెప్పుకొచ్చారు. కానీ పదేళ్లు ఆలస్యంగా ఇచ్చారని మండిపడ్డారు. అయినా దీక్షతో రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని చాలా విషయాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మరింత అభివృద్ది పథంలో దూసుకెళ్తున్న తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ గోసపడతామన్నారు. కర్ణాటకలో ఇప్పుడు చీకట్లు అలముకున్నాయని చెప్పారు. అక్కడ రైతులకు కనీసం ఐదు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఇక్కడ పీసీసీ చీఫ్ కూడా రైతులకు 24 గంటల కరెంటు ఎందుకని ప్రశ్నించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారని… అలా తీసేస్తే రైతు బంధు లాంటి పథకాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని తమది సకలజనులు సాధించుకున్న ప్రజాతెలంగాణ అని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు తెలంగాణ ప్రేమికులకు మధ్యే అని అభిప్రాయపడ్డారు కవిత. తెలంగాణ వద్దని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్నారని గుర్తు చేశారు. కర్ణాటకలో రైతులకు కేవలం ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నారని అక్కడి ప్రజల్ని మోసం చేశారని కవిత కాంగ్రెస్ మంత్రి మాటల్ని ట్వీట్ చేశారు