
—జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, నవంబర్ 02 (వాయిస్ టుడే): నవంబర్ 3 నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న క్రమంలో నామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం మానకొండూర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చేపట్టిన నామినేషన్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ, నేటి నుండి (శుక్రవారం) ప్రారంభం కానున్న నామినేషన్ ల ప్రక్రియ కొరకు ఏర్పాట్లను పూర్తిచేయాలని తెలిపారు. నామినేషన్ తంతు ముగిసే వరకు కార్యాలయంలొ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు వారు చేసే ఖర్చులు, నిర్వహించాల్సిన రికార్డుల గురించి తెలియజేయాలన్నారు. పార్టీల అభ్యర్థుల ఖర్చుల వివరాలను వ్యయ పరిశీలకులకు అందించాలని, ఎన్నికల నియమ నింబంధనల మేరకు ఏర్పాట్లు చేపట్టి ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం ఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ఫెసిలిటేషన్ సెంటర్, నామినేషన్ పేపర్లు అందించే కౌంటర్, సెక్యూరిటి డిపాజిట్ కౌంటర్, కంట్రొల్ రూం లను పరిశీలించారు. ఈ కార్యాలయంలో మానకొండూర్ రిటర్నింగ్ అధికారి లక్ష్మీ కిరణ్, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.