మంథనిలో ఈవ్ టిజర్ల బెడద
Eve teasers in Manthani
-ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు
-పట్టించుకోని పోలీసులు
-ఏదైనా అవాంచనీయ సంఘటనలు జరిగితే ఎవరిది బాధ్యత
మంథని
నియోజకర్గ కేంద్రమైన మంథనిలో ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్న యువత ఆగడాలు రోజూ రోజుకీ శ్రుతి మించుతున్నాయ్. మంథని పట్టణానికి నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. పట్టణంలో సుమారు పదికి పైగా పాఠశాలలు, రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, రెండు డిగ్రీ కళాశాలలో ఉన్నాయి. వీరిలో సగానికి పైగా అమ్మాయిలు విద్యనభ్యసిస్తున్నారు. స్థానిక బస్టాండులో మొదలైన ఈ ఆకతాయిల వేధింపులు విద్య సంస్థల వద్దకు వెళ్ళే దాకా కొనసాగుతున్నాయని బాధితులు వాపోతున్నారు. పట్టణంలోనీ పలు వీధుల్లో సైతం వేధింపులు కొనసాగుతుండటంతో ఒంటరిగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఉదయం విద్యాసంస్థలు మొదలయ్యే సమయంలో ద్విచ్రవాహనంపై ముగ్గురు చొప్పున ఆకతాయిలు తిరుగుతూ ఈలలు, కేరింతలతో విద్యార్థినులను కామెంట్లు చేస్తున్నారు. శబ్దాలు వచ్చేలాగా వాహనాలతో వచ్చిన సైలెన్సర్లను మార్చడం రయ్‌రయ్ మంటూ వెళ్తూ జనసంచారం ఉండే ప్రాంతాలల్లో ఫట్‌ఫట్ ఢాంఢాం మంటూ దడ పుట్టించేలా పెద్దపెద్ద శబ్ధాలు చేస్తూ విద్యార్థినిలను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మళ్ళి అదే బ్యాచ్ సాయంకాలం నాలుగు, ఐదు గంటల మధ్య అదే విధంగా ప్రవర్తిస్తున్న తీరు పట్ల విద్యార్థినులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈవ్ టీజింగ్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాంటి వారి వివరాలూ తెలపాలని పాఠశాలలు, కళాశాలల్లో అవగహన కార్యక్రమాలు చెప్పట్టే పోలీసులు ఒక్క ఆకతాయినీ పట్టుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తమకు అవగహన కల్పిస్తే ఏం లాభం లేదని, తమ వెంట పడి వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరుతున్నారు. గతంలో కొన్ని సార్లు పోలీసులు విద్యా సంస్థల వద్ద నిఘా పెట్టినప్పటికీ అదీ కంటి తుడుపు చర్యలుగా మిగిలాయి. పోలీసులు యూనిఫాం లో కనపడగానే ఆకతాయిలు తమ రూట్ లను మార్పు చేసుకుని అదనుగా ఉన్న సమయంలో మళ్లీ అదే విధంగా రెచ్చిపోతున్నారు. రేపు ఏదైనా జరగరాని సంఘటన చోటు చేసుకుంటే ఎలా అనే ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగక ముందే పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరుతున్నారు.