ధరణి పోయినా ధోరణి మారలేదు.. భూభారతి భూహారతిగా మారింది: ఈటల

- Advertisement -

పేదల భూములపై ప్రభుత్వం కీచకుల్లా వ్యవహరిస్తోంది: ఎంపీ ఈటల రాజేందర్

Even though the Dharani is gone, the trend has not changed.. Bhubharati has become Bhubharati: Etala

హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణలో పేదలు, రైతుల భూములను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ తరహాలో వ్యవహరిస్తూ భారీ భూదందాకు తెరతీస్తోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ధరణి పోయినా ధోరణి మారలేదు

తెలంగాణ ఏర్పడితే భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ప్రజలు ఆశించారని, అయితే గత ప్రభుత్వం ధరణి పేరుతో పేద రైతుల హక్కులను దెబ్బతీసిందని ఈటల విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేసి భూభారతి తీసుకొచ్చినా పరిస్థితిలో మార్పు లేదన్నారు.

“ధరణి పోయినా ధోరణి మారలేదు.. భూభారతి కాస్త పేదల పాలిట భూహారతిగా మారింది” అని ఈటల ఎద్దేవా చేశారు.

ధరణి రాకముందు పహాణీల్లో ఉన్న పలు కీలక వివరాలను తొలగించడం వల్ల దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్న దళితులు, గిరిజనులు, బీసీ రైతులు నష్టపోయారని ఆయన ఆరోపించారు.

హైడ్రా, పోలీసుల పహారాలో భూముల స్వాధీనం

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూముల వేలం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవాలని చూస్తోందని ఈటల ఆరోపించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో పేదల భూములకు హైడ్రా, పోలీసుల పహారాలో రాత్రికి రాత్రే ఫెన్సింగ్‌లు, గోడలు నిర్మిస్తున్నారని అన్నారు.

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు భూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పేదలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.

బడంగ్‌పేట్‌ భూములపై ఆరోపణలు

బడంగ్‌పేట్‌లో ఐదు తరాలుగా సుమారు 78 ఏళ్లుగా 46 మంది రైతులు సాగు చేసుకుంటున్న 45 ఎకరాల 16 గుంటల భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఈటల ఆరోపించారు.

దుండిగల్‌ సర్వే నంబర్లు 452, 453లో సుమారు 400 ఎకరాల్లో 500 మంది రైతులు, బోరంపేట సర్వే నంబర్‌ 166లో సుమారు 440 ఎకరాల్లో 150 మంది రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారని తెలిపారు. వారి భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

బోరంపేట సర్వే నంబర్‌ 472లోని సుమారు 30 ఎకరాలకు ప్రీకాస్ట్‌ గోడలు నిర్మించారని పేర్కొన్నారు.

బొమ్మరాజుపేటలో 1,049 ఎకరాలపై వివాదం

శామీర్‌పేట్‌ పరిధిలోని బొమ్మరాజుపేటలో 1965 నాటి రికార్డులకు సంబంధించిన సుమారు 1,049 ఎకరాల భూమి వివాదంలో ఉందని ఈటల తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా రికార్డుల మార్పులు జరిగాయని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు.

శంషీగూడ భూములపై ఆరోపణలు

ఎల్లమ్మబండలోని శంషీగూడ సర్వే నంబర్‌ 57లో మొత్తం 333 ఎకరాల భూమి ఉందని, అందులో పేదలు, జర్నలిస్టులకు కేటాయించిన భూములు మినహా మిగిలిన సుమారు 90 ఎకరాల భూమిపై వివాదాలు కొనసాగుతున్నాయని ఈటల పేర్కొన్నారు.

ఆ భూమి విలువ సుమారు రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. కోర్టు కేసులను అడ్డం పెట్టుకుని ప్రైవేట్‌ వ్యక్తులతో సెటిల్‌మెంట్లు చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

కూకట్‌పల్లి IDL భూములపై సంచలన వ్యాఖ్యలు

కూకట్‌పల్లిలో గతంలో ఇండియన్‌ డిటనేటర్స్‌ లిమిటెడ్‌ (IDL) పేరిట ఉన్న 330 ఎకరాలకు పైగా భూములు చేతులు మారిన వ్యవహారంపై ఈటల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భూముల విలువ సుమారు రూ.20 వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

ఫినిక్స్‌ సంస్థ మధ్యవర్తిత్వంతో భూములు బదిలీ అయ్యాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం అక్కడ ఒక్కో విల్లా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు విక్రయిస్తున్నారని తెలిపారు.

ఫ్యూచర్‌ సిటీ భూములపైనా ఆందోళన

బహదూర్‌గూడ, ఫ్యూచర్‌ సిటీ ప్రాంతాల్లో 70–80 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతుల నుంచి సుమారు 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈటల ఆరోపించారు.

పేదలు, రైతుల భూములను బలవంతంగా లాక్కుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు.

“పేదల భూములను కాపాడాల్సిన ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా వ్యవహరిస్తోంది. రైతులు, పేదల భూములను లాక్కుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. ప్రజల భూముల కోసం బీజేపీ పోరాడుతుంది” అని ఈటల రాజేందర్ అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular