- Advertisement -
ప్రతి రోజూ గరుడ సేవగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులకు సేవలు అందించాలి
Every day should considered Garuda Seva with utmost devotion
– అధికారులకు దిశా నిర్దేశం చేసిన టీటీడీ ఈవో
తిరుమల,
ప్రతి రోజూ గరుడ సేవగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలోని బ్రహ్మోత్సవం సెల్‌లో శుక్రవారం ఉదయం అక్టోబరు 12న జరగనున్న చక్రస్నానం ఏర్పాట్లపై ఈవో, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఏర్పాట్లపై చర్చిస్తూ, చివరి రోజు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఉద్యోగులను కోరారు. పుష్కరిణిలోని అన్ని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లు, పురుషులు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత మెరుగ్గా ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. శనివారం చక్రస్నానం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు ఆచరించాలని, ఆరోగ్య (పారిశుద్ధ్యం), వైద్య, విజిలెన్స్ విభాగాలు మరింత చురుగ్గా పనిచేయాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు. పుష్కరిణి సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నందున క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో పోలీసులతో సమన్వయం చేసుకొని పని చేయాలని సివిఎస్‌ఓను ఈవో ఆదేశించారు. అనంతరం అదనపు ఈవో మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విభాగం ఇప్పటికే పుష్కరిణి, పరిసర ప్రాంతాలలో సమాచార బోర్డులు ఏర్పాటు చేసిందని, పుష్కరిణి లోపల స్థలం పరిమితంగా ఉండడంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది మరింత జాగ్రత్తగా విధులను నిర్వహించాలని సూచించారు.
పుష్కరిణిలో ప్రతి 20 మీటర్ల దూరానికి ఒక ఈతగాడిని, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు 40 లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేసినట్లు సివిఎస్‌వో శ్రీ శ్రీధర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -