అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
ఓటర్ నమోదు అనేది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు ప్రజాస్వామ్యంలో తమ బాధ్యత
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి
ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా చిలుకూరు మండల కేంద్రంలో ఓటరు నమోదు అవగాహన సదస్సు
మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్
Every eligible graduate must be registered as a voter: Former MLA Sri Bollam Mallaiah Yadav.
కోదాడ , అక్టోబర్ 11(వాయిస్ టుడే ప్రతినిధి)
ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించేందుకు కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ చిలుకూరు మండల కేంద్రంలో మండల నాయకులతో కలిసి ఓటరు నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులకు దిశానిర్దేశం చేస్తూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను నాయకులందరూ సమన్వయంతో చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, పట్టభద్రుల ఓటరు నమోదు అనేది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంలో తమ హక్కులను పరిరక్షించుకోవడానికి, తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి లభించిన కీలకమైన అవకాశమని పేర్కొన్నారు. ఓటు హక్కు ద్వారా పట్టభద్రులు తమ సమస్యలను ప్రజాస్వామ్య వేదికలపై వినిపించే అవకాశం ఉంటుందని, అందువల్ల అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. విద్యావంతులైన యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారు, వివిధ వృత్తుల్లో కొనసాగుతున్న పట్టభద్రులు తమ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని సూచించారు. ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్యారంగ సమస్యలు, ఉద్యోగుల హక్కులు, పట్టభద్రుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై సమర్థవంతమైన చర్చ జరగాలంటే పట్టభద్రులు ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనడం అవసరమని తెలిపారు. ఓటరు నమోదు విషయంలో ఎవరూ అలసత్వం ప్రదర్శించకూడదు. చివరి క్షణం వరకు వేచి చూడకుండా ఇప్పటి నుంచే గ్రామాల వారీగా, వార్డుల వారీగా అర్హులైన పట్టభద్రులను గుర్తించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. ప్రతి నాయకుడు తన పరిధిలోని పట్టభద్రులను కలిసి, ఓటరు నమోదుకు సంబంధించిన ప్రాధాన్యతను వారికి వివరించి, అవసరమైన విధానాన్ని తెలియజేయాలని కోరారు. ఇప్పటికే ఓటరుగా నమోదైనవారిని, ఇంకా నమోదు కానివారిని గుర్తించి, అర్హులైన వారు ఎవరూ మిగిలిపోకుండా సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. రానున్న సాధారణ ఎన్నికలకు ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న ఆదరణను అంచనా వేసుకునే రాజకీయ ప్రాధాన్యత కలిగిన ఎన్నికగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ శ్రేణులు భావించాలని బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం – వరంగల్ – నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో కోదాడ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని ఆయన కోరారు. ఈ లక్ష్య సాధనకు ఓటరు నమోదు కార్యక్రమమే తొలి అడుగు అని పేర్కొంటూ, ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు బాధ్యత తీసుకొని పట్టభద్రులను గుర్తించడం, వారితో సమావేశాలు నిర్వహించడం, నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిరంతరాయంగా చేపట్టాలని తెలిపారు.




