అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవాలి
దరఖాస్తు ఫారాలు అమ్మే వారిపై కఠిన చర్యలు
ప్రతీ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
జగిత్యాల
అర్హులైన ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా తప్పనిసరిగా ప్రజా పాలన కార్యక్రమం కింద దరఖాస్తు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.బుధవారం రోజున పట్టణంలోని 25,26వ వార్డు ,జగిత్యాల గ్రామీణ మండలంలోని అనంతారం, తక్కళ్ళపల్లి గ్రామాలలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పర్యటించి అభయ హస్తం కార్యక్రమం కింద ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో అర్హత కలిగిన ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ఈ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరించాలని సంబంధింత ఇంచార్జీ అధికారులను ఆదేశించారు. కుటుంబ వివరాలు తెలిపే ధరఖాస్తు ఫారాలలో దరఖాస్తుదారుని వివరాలు అభయ హస్తం గ్యారంటి పథకాలు లబ్ది పొందటానికి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత పథకాల లబ్ది పొందటానికి నిర్ణిత ప్రోఫార్మలో సూచించిన పూర్తీ వివరాలను దరఖాస్తు దారు నమోదు చేసారా లేదా అని పరిశీలించాలని, వారి కుటుంబం నివసిస్తున్న ప్రాంతం, తదితర విషయాలను తెలుసుకొని లబ్ది చేకూరే విధంగా దరఖాస్తు దారునికి అవగాహన కల్పించాలని అన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్సు ప్రతులను జత చేసే విధంగా పరిశీలించుకోవాలని సంబంధిత సిబ్బందికి తెలియజేశారు. దరఖాస్తులను అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుందని, ఫారాలను కొనుగోలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై కలెక్టర్ సీరియస్ గా వ్యవహరిస్తూ దరఖాస్తు ఫారాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. దరఖాస్తు దారులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రతీ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 5 గ్యారంటి ల పథకానికి సంబంధించిన కానటువంటి దరఖాస్తులు కూడా ప్రత్యేక కౌంటర్ లో సమర్పించవచ్చని అన్నారు. దరఖాస్తు దారునికి అభయ హస్తం, గ్యారంటి పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి రశీదును తప్పనిసరిగా అందించాలని సిబ్బందికి సూచించారు. గ్రామాలు, పట్టణాల్లోని కుటుంబాల నుండి దరఖాస్తు ఫారాలను ఈ నెల 6 వ తారీకు వరకు ప్రతిరోజూ స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. పట్టణాల్లోని కుటుంబాలు ఆయా మున్సిపాలిటిలో, గ్రామాల్లోని కుటుంబాలు స్థానిక పంచాయతి కార్యదర్శికి అందజేయవచ్చని అన్నారు. స్థానిక సర్పంచులు, ప్రజా ప్రతినిధులు వారి పరిధిలోని కుటుంబాలకు అభయ హస్తం, గ్యారంటి పథకాలపై విస్తృత అవగాహన కల్పించి దరఖాస్తులు సమర్పించే విధంగా ప్రచారం చేయాలని సర్పంచులను కోరారు.ఈ కార్యక్రమాలలో జిల్లా పంచాయతి అధికారి దేవరాజ్, మున్సిపల్ కమీషనర్ అనిల్ బాబు, గృహ నిర్మాణ డి.ఈ. రాజేశ్వర్, మెప్మా పి.డి. శ్రీనివాస్, పశు సంవర్ధక శాఖ ఏ.డి. నరేష్, ఆయా కేంద్రాల ఇంచార్జ్ లు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



