ఫిబ్రవరి 11 నుండి 13వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
February 11th to 13th Shrivari Quarterly Melotsavam
తిరుమల
టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11 నుండి 13వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది.
ఫిబ్రవరి 11, 12వ తేదీలలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు భజన మండళ్లతో నామ సంకీర్తన, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మానవాళికి అందించిన ఉపదేశాలు తెలియజేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఫిబ్రవరి 13న ఉదయం 8.30 గంటలకు సామూహిక నామ సంకీర్తన, ఉదయం 9.30 గంటల నుండి స్వామిజీలు ధార్మిక సందేశం ఇవ్వనున్నారు.
ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.
పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.