నల్గొండ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో తెల్లవారుజామున మాతాశిశు ఆరోగ్య కేంద్రం స్టోర్ రూంలో షాక్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రూమ్ లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ మండడంతో పొగలు అలుముకున్నాయి. ఇది గమనించిన రోగులు, వారి సహాయకులు పిల్లలతో సహా భయంతో బయటకు పరుగులు తీశారు.వెంటనే ఆస్పత్రి సిబ్బంది అలర్ట్ అయ్యారు. పొగలు బయటకు వెళ్లేందుకు కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. మంటలను ఆర్పివేయడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు పూర్తిగా ఆర్పిన తర్వాత.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన చోటుచేసుకుందని తెలిపారు.మరోవైపు దట్టమైన పొగ వల్ల చిన్నారులు ఊపిరి పీల్చుకునేందుకు కష్టమవుతోందని తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు.