కరీంనగర్, నవంబర్ 20, (వాయిస్ టుడే): తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్యాసింజర్ ఆటోలకు ఫిట్ నెస్, పర్మిట్ ఫీజు రద్దు చేస్తామని చెప్పారు. ఫిట్ నెస్ ఫీజు రూ.700, పర్మిట్ ఫీజు రూ.500 రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ‘ఆటో డ్రైవర్లు ఏడాదికి ఓసారి ఫిట్ నెస్ చేయించుకోవాలి. ఫిట్ నెస్ కు, సర్టిఫికెట్ ఇచ్చేందుకు మొత్తం రూ.1200 అవుతుంది. ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఆ ఛార్జీలు రద్దు చేస్తాం.’ అని ప్రకటించారు. తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అలవెన్స్ వారి వేతనంలో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే అని వెల్లడించారు. లంగాణ ఎన్నికల ప్రచారంలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండో విడతగా.. ఇప్పుడు ప్రతీ రోజూ 3-4 నియోజకవర్గాల్లో ప్రజాశీర్వాద బహిరంగసభల్లో పాల్గొంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో విపక్షాలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం మానకొండూర్, స్టేషన్ ఘనపూర్, నకిరేకల్, నల్గొండ బహిరంగ సభలలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఆలోచించి ఓటు వేయండి
బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలతో నియోజకవర్గాలను చుట్టేస్తున్న గులాబీ బాస్.. ఆల్ ఆఫ్ సడెన్‌గా ప్రసంగం తీరును మార్చేశారు. పంచుల్లో పదును పెంచి.. కాంగ్రెస్‌తో పాటు బీజేపీని కార్నర్ చేశారు. ఆ రెండు పార్టీలకు ఓటేసి గోసపడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతీ సభలోనూ బీఆర్‌ఎస్ హాయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని.. అలాగే తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలతో 58ఏళ్లు అరిగోసపడ్డామన్నారు కేసీఆర్. తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ ధోఖా చేసిందని.. అలాంటి పార్టీని మళ్లీ నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు