ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు తెలంగాణలకు
రేవంత్రెడ్డి ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలత
కేంద్రానికి లెటర్ రాయాలని సీఎంల నిర్ణయం.?
హైదరాబాద్
దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఫలప్రదంగా జరిగినట్టు తెలిసింది.
ఇందులో ప్రధానంగా.. ఏపీలో కలిపిన ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను తిరిగి ఇవ్వాలన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు రెండు రాష్ట్రాల సీఎంలు కేంద్ర హోంశాఖకు లెటర్ రాయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
శనివారం ప్రజాభవన్లో రెండు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం మొదలైన తర్వాత సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్నందున తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు సహకరించాలని చంద్రబాబును రేవంత్ కోరారు. ఇక విభజన సమస్యల పరిష్కారానికి కలిసి నడవాలనే ప్రతిపాదన రాగా. ప్రపంచంలో చర్చలతో పరిష్కారం కానిది ఏదీ ఉండదని ఇద్దరు సీఎంలు అంగీకారం తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు ఉండాలని. ఏపీ, తెలంగాణ ప్రజల సెంటిమెంట్, డెవలప్మెంట్ ఎక్కడా దెబ్బతినకుండా ముందుకు వెళ్లా లని నిర్ణయించారు.
కృష్ణా నీటి పంపకాలపై కేం ద్రంతో మాట్లాడి ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తున్నది. తెలంగాణ, ఏపీకి తప్పకుండా మంచి జరుగుతుందని.. గతంలో తాను ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, ఇప్పుడు కూడా తనవంతు సహకారం అందించనున్నట్టు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. యువతకు డ్రగ్స్ శాపంగా మారిందని.. ఈ సమస్య రెండు రాష్ట్రాలను వేధిస్తున్నదని సమావేశంలో చర్చించారు. మరో పంజాబ్ లా మారకముందే డ్రగ్స్ను కట్టడి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదను సీఎం రేవంత్ రెడ్డి చేయగా. ఏపీ చంద్రబాబు ఓకే చెప్పారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ కట్టడికి కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆయన తెలిపారు.
ఆర్డినెన్స్ సవరించాలంటే కేంద్రం అనుమతి మస్ట్
2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా చివరిక్షణంలో కేంద్రం పోలవరం ఆర్డినెన్స్ను తీసుకొచ్చి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసింది. ఈ ఆర్డినెన్స్ సవరిస్తేనే ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్టు తెలిసింది.
ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు తెలంగాణలకు
- Advertisement -
- Advertisement -