కాలువల నిర్వహణ లోపాలతోనే పట్టణాల్లో వరదలు
సహజ నీటి ప్రవాహాలను కాపాడితే వరద ముప్పు తగ్గుతుంది
ఐఏఎస్ అధికారుల శిక్షణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
Flooding in towns is due to lapses in canal maintenance: HYDRA Commissioner AV Ranganath
ముస్సోరీ/హైదరాబాద్: పట్టణాల్లో వరదలు సంభవించడానికి కేవలం అధిక వర్షపాతమే కాకుండా, వరద కాలువల నిర్వహణలో లోపాలు, చెరువులు, సహజ నీటి ప్రవాహ మార్గాల ఆక్రమణలు కూడా ప్రధాన కారణాలని ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, వరద కాలువలు, సహజ జలమార్గాలను పరిరక్షిస్తే వరదల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన అన్నారు.
మంగళవారం లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరీలో నిర్వహించిన ఐఏఎస్ అధికారుల సామర్థ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో “పట్టణాల్లో వరద ముప్పు నివారణకు విపత్తు నిర్వహణ వ్యూహాలు” అనే అంశంపై ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పట్టణాభివృద్ధి, పరిపాలన, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులకు వరదలకు గల కారణాలు, నివారణ చర్యలను వివరించారు.
హైడ్రా ఏర్పాటు లక్ష్యాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు వరదల నివారణకు చేపడుతున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన రంగనాథ్, చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజా అవసరాల స్థలాల పరిరక్షణలో హైడ్రా తీసుకుంటున్న చర్యలను వివరించారు.
గత రెండేళ్లలో ఆక్రమణల నుంచి 2,471 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించడంతో పాటు, చెరువులు, నాలాల పరిధిలో 480 ఎకరాలకు పైగా ఆక్రమణలను తొలగించడం విశేషమని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులు ప్రశంసించినట్లు తెలిపారు. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కోర్టు కేసుల నిర్వహణ, రాజకీయ ఒత్తిడులను ఎలా ఎదుర్కొంటున్నారనే అంశాలపై అధికారులు ఆసక్తిగా చర్చించినట్లు వెల్లడించారు.
సహజ జలమార్గాల పరిరక్షణే శాశ్వత పరిష్కారం
బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో సహజ నీటి ప్రవాహ మార్గాలు, చెరువులు, నదులు, చిత్తడి భూములు ఆక్రమణలకు గురవడం వల్ల వరదలు తీవ్రరూపం దాల్చుతున్నాయని రంగనాథ్ వివరించారు. కాంక్రీటీకరణ పెరగడంతో వర్షపు నీరు భూమిలో ఇంకకుండా నేరుగా కాలువల్లోకి చేరి రహదారులు, నివాస ప్రాంతాలను ముంచెత్తుతోందన్నారు.
బెంగళూరులో చెరువులు, రాజకాలువల ఆక్రమణలు, ముంబైలో మిథి నది వెడల్పు తగ్గడం, పాత డ్రైనేజీ వ్యవస్థ, ఢిల్లీలో పెరిగిన జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ విస్తరించకపోవడం వంటి అంశాలను ఉదాహరణగా ప్రస్తావించారు.
హైదరాబాద్‌లో వరదల నివారణకు చర్యలు
హైదరాబాద్ కూడా ఈ సమస్యలకు అతీతం కాదని పేర్కొన్న రంగనాథ్, గొలుసుకట్టు చెరువులు, వరద కాలువల పరిరక్షణకు హైడ్రా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మొదటి దశలో ఆరు చెరువుల పునరుద్ధరణలో 75 ఎకరాల ఆక్రమణలను తొలగించి, పూడిక తొలగింపు, ఇన్లెట్లు, ఔట్లెట్ల అభివృద్ధి ద్వారా వరద ముప్పును తగ్గించినట్లు తెలిపారు.
ప్రస్తుతం మరో 14 చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, ఇందులో 150 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమణల నుంచి రక్షిస్తున్నట్లు వెల్లడించారు. వర్షాకాలంలో హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్, మాన్సూన్ రెస్పాన్స్ బృందాలు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
సికింద్రాబాద్‌లో ప్యాట్నీ నాలాపై ఆక్రమణలను తొలగించడం ద్వారా ఎనిమిది కాలనీలకు వరద ముప్పు తగ్గిందని, అమీర్‌పేటలో భూగర్భ డ్రైనేజీ పైపులను శుభ్రం చేయడం ద్వారా నీటి నిల్వ సమస్యను నివారించినట్లు తెలిపారు.
హైడ్రా చేపడుతున్న ఆక్రమణల తొలగింపు, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు ప్రజల సహకారం కూడా అత్యంత అవసరమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు.




