తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటింగ్ మిగలింది. తమ సపోర్టర్లు అందరితో ఓట్లు వేయించుకోవడానికి రాజకీయ పార్టీలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాయి. కానీ జనం ఆసక్తి చూపించపోతే మాత్రం ఓటింగ్ శాతం పెరగదు. దేశంలో ఇతర రాష్ట్రాలతో తెలంగాణలో పోలింగ్ శాతం కాస్త బెటర్ గానే ఉంటుంది. 70 నుంచి 75 శాతం మధ్య ఓటింగ్ నమోదవుతోంది. కానీ పాతిక శాతం మంది ఓటింగ్ కు దూరంగా ఉండటం అంటే.. చిన్న విషయం కాదు. పైగా పట్టణాల్లో పోలింగ్ శాతం యాభై శాతం వరకే ఉంటోంది. ఎంత ఎక్కువ మంది ఓటు వినియోగించుకుంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించి హక్కు ఇచ్చేది ఓటు. మన రాష్ట్ర .. దేశ స్థితిగతులనే మార్చే శక్తి ఓటుకు ఉంది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలా మంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలి, మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండడమే కాదు ఓటూ ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఓటు వేయకపోతే పౌరుడిగా బాధ్యతల్లో ఫెయిల్ అయినట్లే. ఓటు హక్కు వల్ల రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. ఫలితంగా ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న కులం, మతం, ధనం లాంటి అంశాల ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఓటు విలువ తెలియక కొంత మంది ఓటింగ్‌కు దూరం అవుతుంటే, ఓటు ప్రాముఖ్యత తెలిసినా నిర్లక్ష్యంతో మరికొంత మంది ఓటు వేయటానికి అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో, విద్యావంతులు నివసించే ప్రాంతాల్లో 50 శాతం ఓటు నమోదు కావడమే గగనమైపోతోంది. అభ్యర్థులు ఎవరూ నచ్చక ఓటు వేయడానికి దూరంగా ఉండే వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు రప్పించడానికి ఎన్నికల సంఘం ‘పై అభ్యర్థులు ఎవరూ కాదు ఆప్షన్ చేర్చిన ప్రయోజనం కానరావడం లేదు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన చట్టసభలలో నిజాయితీపరులు, సమర్ధులు, సేవా గుణం ఉన్నవారు పోటీ చేసి గెలుపొందడం వల్ల రాజ్యాంగ నిర్మాతలు కలలు కన్న దేశ భవిష్యత్తుకు, సమాజ నిర్మాణానికి పునాదులు పడతాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికల్లో 67 శాతం మాత్ర మే ఓటింగ్ నమోదయింది. పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీల్లో రాను రాను పోలింగ్ తగ్గుతోంది. 2014లో హైదరాబాద్‌లో 53శా తం పోలవగా 2018లో 51 శాతం మాత్రమే నమోదైంది. విద్యావంతులు ఉండే నగరం.. చైతన్యవంతులయిన నగరం.. ఓటు హక్కు తెలిసిన నగరంలో.. ఇలా తక్కువ ఓటింగ్ ఎందుకు నమోదవుతోంది..?., ఒక్క సారి కాదు.. హోరాహోరీగా ఎన్నికలు జరిగి.. దాదాపు ప్రతి ఇంట్లోనూ.. ఎన్నికల గురించి… చర్చ జరిగే రోజులు ఇవి. ఇలాంటి సందర్భాల్లోనూ.. ఓటింగ్ ఎందుకు తక్కువ నమోదవుతోంది. సెలవు ఇచ్చి మరీ ఓటు వేయమంటే.. ప్రజలు వేయడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామిక ఫలాలు అధికంగా అనుభవిస్తున్న విద్యావంతులు, పట్టణ ప్రాంతాలు, మహానగరాల్లోని సంపన్న వర్గాలు ఓటింగ్ పట్ల అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీనికి భిన్నంగా ప్రజాస్వామ్య ప్రయోజనాలకు దూరంగా ఉన్న వర్గాల ప్రజలే ఓటు వేయడానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఓటింగ్ శాతాన్ని పెంపొందించడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్న ప్రయోజనం కనిపించడం లేదు. అనేక దేశాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరి. బెల్జియం, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఓటు వేయనట్లయితే జరిమానాలు విధిస్తారు. భారత దేశంలో కూడా నిర్బంధ ఓటింగ్ విధానం ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందనే చర్చ రావడానికి కారణం… 30 శాతం మంది ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉంటూండమే. అయితే ఓటు వినియోగం పర్సంటేజీ తక్కువగా నమోదవడానికి ఓటర్ల జాబితాలో పొరపాట్లు కూా కారణమన్న విమర్శలు ఉన్నాయి. ఓటరు గుర్తింపు కార్డులున్నా ఓటరు జాబితాలో పేరు లేకపోవటం, దరఖాస్తు చేసుకున్నా.. ఓటు ఇవ్వకపోవడం… అలాగే.. ఊళ్లలో ఓట్లు ఉన్నా.. డూప్లికేటింగ్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఈ పరిస్థితి తలెత్తింది. ఊళ్లలో ఓట్లు ఉన్న వారు. .. తమ ఊరి నుంచి వచ్చే ఒత్తిడి.. రానుపోను చార్జీలకు తోడు.. పైన ఎంతో కొంత రాజకీయ పార్టీలు ఇస్తూండటంతో.. ఊళ్లలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. ఇక్కడ తప్పు ఓటర్లతే కాదు.. సమగ్రంగా ఓటర్ జాబితా తయారు చేయాల్సిన వారిది కూడా ఉంది. ప్రజాస్వామ్యానికి మూలం ఓటు కాబట్టి అన్ని వైపుల నుంచి ఓటు విషయంలో పవిత్రంగా వ్యవహరిస్తే మన ప్రజాస్వామ్యం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. లేకపోతే బనానా రిపబ్లిక్ గా మారిపోతుంది.


