హైదరాబాద్, నవంబర్ 15, (వాయిస్ టుడే ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంటోంది. క్షేత్రస్థాయి ప్రచారంతో పాటు వ్యతిరేకంగా మారుతున్నాయి అనుకున్న వర్గాల్ని ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ అడుగు ముందుకు వేశారు. ఇటీవల ఏపీలో జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న సీమంధ్ర మూలాలున్న ఓటర్లు బీఆర్ఎస్‌కు దూరమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కేటీఆర్ ఇటీవలి కాలంలో ఈ ఆంశంపైనే ఓపెన్ గా మాట్లాడుతున్నారు. టీవీ చానళ్లకు ఇస్తున్న ఇంటర్యూల్లో తాను అలా అనకుండా ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం.. తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశం అయింది. దీనికి కారణం హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపడమే కాదు.. కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. చంద్రబాబును అరెస్టు చేసిన రోజున కేటీఆర్ ఓ వివాదాస్పద ట్వీట్ పెట్టారు. తర్వాత హైదరాబాద్ లో నిరసనలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏపీ రాజకీయాలు ఏపీలో చూసుకోవాలని రాజమండ్రిలో భూమిబద్దలయ్యేంత ర్యాలీ చేసుకోవచ్చని సెటైర్లు వేశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు బీఆర్ఎస్‌పై వ్యతిరేకతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీకి ఓటు వేయవద్దని అంటున్నారు. ఈ పరిణామాలు వ్యతిరేకంగా మారుతున్నాయని అనిపించడంతో కేటీఆర్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఇటీవల టీవీ చానల్స్ లో సుదీర్ఘ చర్చలకు హాజరవుతున్న కేటీఆర్ ఏపీకి సంబంధించిన అంశాలపైన వివరణ ఇచ్చేందుకు టీడీపీ సానుభూతిపరుల్లో తమపై ఉన్న ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో తాను నిరసనలు చేయవద్దని చెప్పలేదని… శాంతిభద్రతల సమస్య గురించి చెప్పానని కేటీఆర్ అంటున్నారు. తాను మరో విధంగా చెప్పి ఉండాల్సిందన్నారు. అంతే కాదు.. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు.. ఏపీ నుంచి ఓ ముఖ్య వ్యక్తి ిఫోన్ చేసి.. ఓటుకు నోటు తీయమన్నా తీయలేదన్నారు. అలాగే రామోజీరావు అరెస్టు విషయంలో కూడా చట్ట పరంగానే జరగాలని తాము చెప్పామని.. ఇలాంటివి కరెక్ట్ కాదన్నామన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తమ అభిప్రాయం స్పష్టంగానే ఉందని.. ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపేనన్నారు.
అమరరాజాను తాము లాక్కోలేదని .. వారే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటూంటే… తెలంగాణకే రావొచ్చని ఆహ్వానించానన్నారు. ఇలా.. తమ పార్టీపై ఏపీకి సంబంధిచిన ఓటర్లు… టీడీపీ సానుభూతిపరుల్లో ఉన్న అన్ని సందేహాలను నివృతి చేసే ప్రయత్నం చేశారుగతంలో టీడీపీతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ ను ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు కాబట్టి తము ఏపీ ఎన్నికల్లో జోక్యం చేసుకుని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని కేటీఆర్ చెబుతున్నారు. ఈ సారి చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు కాబట్టి ఏపీ రాజకీయాలపై తమకు సంబంధం లేదన్నట్లుగా కేటీఆర్ చెబుతున్నారు. తాము పొరుగు రాష్ట్ర రాజకీయాలపై అసలు దృష్టి పెట్టడం లేదని చెబుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో జరుగుతున్న నిరసనలను ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని లోకేష్ తనకు ఫోన్ చేయిస్తే.. శాంతిభద్రతలే ముఖ్యమని తాను చెప్పానని కేటీఆర్ గతంలో చెప్పారు. లోకేష్ తనకు మెసెజ్‌లు చేస్తూంటారని.. ఇటీవల ప్రచార వాహనం పై నుంచి పడబోయిన సందర్భంలో తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేదుకు లోకేష్ మెసెజ్ చేశారన్నారు. లోకేష్, పవన్, జగన్ లతో తమకు ఎలాంటి విరోధం లేదంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంతో అనుబంధం ఉన్న ఓటర్ల ప్రాధాన్యత ఎవరూ కాదనలేరు. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని నిర్దేశించగలిగే స్థితిలో ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ెస్ అత్యధిక కార్పొరేటర్ సీట్లు సాధించింది సీమాంధ్ర ప్రాంతంతో అనుబంధం ఉఅన్న ఓటర్లు ఉన్న చోట్లే. అందుకే కేటీఆర్ ప్రత్యేకంగా ఇటీవల జరిగిన పరిణామాలపై విడమర్చి చెబుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.