- Advertisement -
హోమ్ కు పరిమితమైన మాజీ హోమ్ మంత్రులు
Former Home Ministers confined to Home
గుంటూరు, జనవరి 22, (వాయిస్ టుడే)
వైసీపీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే చాలా మంది రాజకీయంగా కనుమరుగవుతున్నారు. గత ఎనిమిది నెలలుగా వారు కన్పించడం మానేశారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన వారు పవర్ పోగానే పెదవులను మూసివేశారు. నాడు అధికార దర్పాన్ని ప్రదర్శించిన నేతలు నేడు చూద్దామన్నా కనిపించడం లేదు. అంటే అధికారంలో ఉంటేనే కనిపించే నేతలు పార్టీలో ఎక్కువ మంది ఉన్నారని దీన్ని బట్టి పార్టీ నాయకత్వానికి ఈపాటికే అర్థమయి ఉండాలి. కొందరు నేతలు పార్టీని వీడి వెళుతుండగా, వీరు పార్టీలో ఉన్నారా? లేరా? అన్న అనుమానం కూడా కలిగేలా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. నియోజకవర్గం మార్చడంతో. అటువంటి వారిలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇద్దరు మహిళలు హోం మంత్రులుగా పనిచేశారు. వారు గత ఎనిమిది నెలలుగా కనిపించడం మానేశారు. ఒకరు తొలిసారి హోంమంత్రి అయిన మేకతోటి సుచరిత. ఈమె గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలిచి జగన్ తొలి కేబినెట్ లో హోం మంత్రి అయ్యారు. హోం మంత్రిగా దాదాపు రెండున్నరేళ్లు యాక్టివ్ గానే ఉన్నారు. అయితే విస్తరణలో ఈమె పదవి కోల్పోయారు. అప్పటి నుంచి మేకతోటి సుచరిత కామ్ అయిపోయారు. పెద్దగా కనిపించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో మేకతోటి సుచరితను తాడికొండ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. అయితే అక్కడ ఓటమి పాలయ్యారు. జిల్లా పార్టీలో కూడా ఆమె యాక్టివ్ గా లేరు. ఆమె ఎక్కడ ఉన్నారన్నది పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. ఇక జగన్ కేబినెట్ లో ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన మరో నేత తానేటి వనిత. ఆమె రెండో విడత మంత్రివర్గ విస్తరణలో హోం మంత్రిగా జగన్ బాధ్యతలను అప్పగించారు. ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన తానేటి వనిత ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం అదృశ్యమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో తానేటి వనితను గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అయితే కూటమి ప్రభంజనంలో తానేటి వనిత కూడా ఓటమి పాలయ్యారు. నాటి నుంచి నేటి వరకూ ఆమె కనిపించడం లేదని క్యాడర్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఓటమి పాలయ్యాక పార్టీని పట్టించుకోకపోవడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. వాగ్దాటి ఉన్నా… ఇద్దరు మహిళ నేతలకు మంచి వాగ్దాటి ఉంది. ఇద్దరినీ తమ సొంత నియోజకవర్గాలను మార్చినందుకే అసంతృప్తిగా ఉన్నారా? అన్న అనుమానం వ్యక్తమవుతుంది. అయితే తిరిగి వారి పాత నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులుగా నియమిస్తే యాక్టివ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. కానీ ఇద్దరు మహిళ నేతలు కనీసం అధికార పార్టీపై విమర్శలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదంటే పార్టీపై అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇద్దరూ ఇక రాజకీయాలనుంచి తప్పుకున్నట్లా? లేక ఎన్నికల సమయానికి మళ్లీ ముందుకొచ్చి టిక్కెట్ తమకే కావాలని పట్టుబడతారా? అన్నది వేరి చూడాలి. కానీ వీరిద్దరి విషయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.
- Advertisement -