సైబర్ ఫ్రాడ్ కేసులో నలుగురు అరెస్టు
జగిత్యాల
Four arrested in cyber fraud case
లావోస్ దేశంలో సైబర్ ఫ్రాడ్ ఉద్యోగాల పేరుతో యువతను అక్రమంగా తరలించి మోసాలకు పాల్పడిన నలుగురిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేసారు. వారినుంచి నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు.
నిందితులు ఇస్లావత్ విజయేందర్ @ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్ , శ్యామ్ రావు రాజశేఖర్. మరో నిందితుడు రాజు , ప్రస్తుతం లావోస్లో ఉన్నాడు.
నిందితుడు విజయేందర్ 2024 నవంబర్లో లావోస్ వెళ్లి అక్కడి సైబర్ ఫ్రాడ్ నెట్వర్క్లో చేరాడు. ప్రతి వ్యక్తిని లావోస్కు రప్పిస్తే ఒక్కొక్కరికి 13,000 యువాన్లు (సుమారు ₹1.75 లక్షలు) కమిషన్ ఇస్తామని చెప్పడంతో జగిత్యాల మరియు పరిసర ప్రాంతాల యువతను రిక్రూట్ చేయడం ప్రారంభించాడు. బ్యాంకాక్ కాల్ సెంటర్ ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుండి ₹75,000 నుండి ₹1,05,000 వరకు వసూలు చేసి, ముందుగా టూరిస్టు వీసాపై థాయిలాండ్ (బ్యాంకాక్) కు రప్పించి, అక్కడి నుండి ఏజెంట్ల ద్వారా సరిహద్దు అక్రమంగా దాటి లావోస్ దేశంలోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతానికి తరలించేవారు. అక్కడ చైనా కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న సైబర్ కాల్ సెంటర్లలో పని చేయమని బలవంతం చేసేవారు.అమెరికా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి, ముఖ్యంగా USAలో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ మోసాలు చేయించేవారు. పని చేయనని చెప్పిన వారికి పాస్పోర్టులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడేవారు.
మోసపోయిన బాధితుని ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు విజయేందర్పై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయగా,మంగళవారం నాడు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణలో మిగతా ముగ్గురు నిందితుల వివరాలు వెలుగులోకి రావడంతో వారిని కూడా అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 4 సెల్ ఫోన్లు, కీలక పత్రాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.



