Sunday, October 27, 2024

ఉచిత ఇసుక రియల్ వ్యాపారులకేనా

- Advertisement -

ఉచిత ఇసుక రియల్ వ్యాపారులకేనా
విజయవాడ, జూలై 9,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని గాడిన పెట్టే చర్యల్లో భాగంగా ప్రారంభించిన ఉచిత ఇసుక ప్రయోజనాలు ఎవరికి దక్కుతాయనే అనుమానాలు కలుగుతున్నాయి. జూలై 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 40లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఉచితంగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది. నామ మాత్రపు ధరలతో రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ పాయింట్ల నుంచి సీనరేజి ఛార్జీలు చెల్లించి పొందొచ్చు. ఒక్కొక్కరు రోజుకు 20టన్నుల ఇసుకను తీసుకోడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో టన్ను ఇసుక ధర రిటైల్ మార్కెట్‌లో పదివేల ధర పలుకుతోంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఒక్కొక్కరు సొంత అవసరాల కోసం రోజుకు 20టన్నుల ఇసుక తీసుకెళ్లడానికి అనుమతించారు. ఇసుకను ఎవరికి వారే తరలించుకెళ్లాలని, నిర్ణీత ఛార్జీలను మాత్రమే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని వరుస క్రమంలో ఇసుకను కేటాయిస్తామని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.ప్రభుత్వ తాజా నిర్ణయం రియల్టర్లు, బడా బిల్డర్లకు మాత్రమే ప్రయోజనం కల్పిస్తుంది. సొంతంగా వాహనాలను సమకూర్చుకోగలిగిన వారికే ఇసుక దక్కుతుంది. సామాన్యులు, సొంతింటి నిర్మాణాలు చేసే వారికి వాహనాల లభ్యత కరువై పోతుంది.ఒక్కొక్కరికి 20టన్నులు రోజుకు కేటాయిస్తే ఆ ఇసుక కొద్ది రోజుల్లోనే పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 20టన్నుల ఇసుకను ఒక్కొక్కరికి 20ట్రాక్టర్లకు సమానమైన ఇసుక రోజుకు అందించడమే అవుతుంది. అంటే ఉచిత ఇసుక అందుబాటులోకి రాకముందు రూ.10వేల రుపాయల ఖరీదు చేసే 20ట్రాక్టర్లకు సమానమైన ఇసుక పొందడానికి వీలు కలుగుతుంది.నగరాల్లో పగటి సమయంలో టిప్పర్లను ప్రస్తుత నిబంధనలు అనుమతించవు. కార్పొరేషన్లలో రాత్రి పదిన్నర నుంచి ఉదయం ఐదు లోపు మాత్రమే ‎భారీ వాహనాలను అనుమతిస్తారు. పట్టణాల్లో ఉండే ఇరుకు రోడ్లలో భారీ టిప్పర్లు తిరిగే అవకాశం కూడా ఉండదు. ఫలితంగా ట్రాక్టర్ల మీదే ఆధారపడాల్సి ఉంటుంది.ఉచిత ఇసుకను ఎవరైనా పొందేందుకు వీలుగా అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అందుకు అవసరమైన కార్యాచరణపై ఎలాంటి స్పష్టత లేదు. వాహనాలను ఎవరికి వారే సమకూర్చుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా దళారీ వ్యవస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితుల్ని ప్రభుత్వమే కల్పిస్తోంది. రవాణా ఛార్జీలను నిర్ణయించకుండా, స్టాక్‌ పాయింట్ల నుంచి సామాన్య ప్రజలు ఇసుకను బుక్‌ చేసుకోవడానికి, నిర్మాణ ప్రాంతానికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుండా ఇసుక సిండికేట్లకు పరోక్షంగా సహకరించేలా నిబంధనలు రూపొందించారు.ఇసుక రవాణా వాహనాలను ఎవరికి వారే సమకూర్చుకోవాలనే నిబంధనతో పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఇసుకను ఉచితమే అయినా, దానిపై అదనపు భారాలు,చెల్లింపుల వల్ల పాత ధరలకే విక్రయిస్తారని బిల్డింగ్ మెటిరియల్ విక్రయదారులు చెబుతున్నారు. ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తుందో, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిపోయిందో కానీ నిర్మాణ రంగానికి ఊతమివ్వాలనే ఆశయం పక్కదారి పెట్టే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంది. 2014-19 మధ్య ఉచిత ఇసుకను అమలు చేసిన సమయంలో కూడా ఇలాంటి సమస్యలే ఉత్పన్నం అయ్యాయి. ఇసుక రీచ్‌లను ప్రాంతాల వారీగా అధికార పార్టీ నాయకులు గుప్పెట్లో పెట్టుకుని పెత్తనం చెలాయించారు.
ఇలా చేస్తే మేలు…
ప్రస్తుతం ఇసుక విక్రయాల్లో ఉన్న లోపాలను సవరించాలి. ఉచిత ఇసుక ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు నేరుగా ప్రజలకే అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆన్‌లైన్‌లో విక్రయించే ఇసుకను నేరుగా ఎవరైనా ఆంక్షలు లేకుండా బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించాలి.
రవాణా ఛార్జీలను ప్రభుత్వమే నిర్ణయించాలి. స్టాక్‌ పాయింట్ లేదా రీచ్‌ నుంచి ఎంత దూరానికి ఎంత చెల్లించాలనే ధరను పట్టణాలు, మునిసిపాలిటీలు, సెమీ అర్బన్, రూరల్‌ ప్రాంతాల వారీగా ధరలను నిర్ణయించాలి.
ఇసుక బుక్‌ చేసుకున్న తర్వాత గరిష్టంగా 24 గంటల్లోగా డెలివరీ జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
ఇసుక తరలింపులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నియంత్రించాలి.
ఇసుకను అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు, జరిమానాలు విధించడంతో పాటు వాటిని సక్రమంగా పాటించాలి.
పట్టణాలు, కార్పొరేషన్లకు సమీపంలో ఉండే ప్రభుత్వ స్థలాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయడం ద్వారా రవాణా భారాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
ఆన్‌లైన్‌లో ఇసుకను పొందే వ్యవస్థ మీద పక్కాగా నిఘా ఉంచాలి. ఎవరైనా స్వేచ్ఛగా ఇసుకను పొందే అవకాశం కల్పిస్తూనే దానిని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారనే నిబంధనను బుకింగ్ సమయంలోనే స్ఫష్టం చేయాలి.
స్టాక్ పాయింట్లలో గుత్తాధిపత్యం లేకుండా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో నడిపే ప్రీపెయిడ్ ఆటో వ్యవస్థల తరహాలో టోకెన్‌ డెలివరీ మెకానిజం ఏర్పాటు చేయాలి.
దూరాన్ని బట్టి ఇసుక రవాణా ఛార్జీలను నిర్ణయించే అధికారం ప్రభుత్వమే తీసుకోవాలి.
ఇసుక రవాణా ద్వారా దళారులు లబ్ది పొందకుండా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే మార్గంగా ఉపయోగిస్తే ఎక్కువ మందికి లబ్ది కలుగుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్