- Advertisement -
గాంధీ ఇప్పుడు ఏ పార్టీ…
Gandhi belongs which party now...
హైదరాబాద్, సెప్టెంబర్ 17, (వాయిస్ టుడే)
పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఫైట్‌లో అధికార పార్టీ ఓ రకమైన గందరగోళం సృష్టిస్తోంది. అదేసమయంలో ఆ పార్టీ కూడా అదే గందరగోళంలో చిక్కుకుంటోందన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను అనర్హత వేటు నుంచి తప్పించేందుకు పీఏసీ చైర్మన్‌గా నియమించిన అధికార పార్టీ నేతలు… బీఆర్‌ఎస్ అభ్యంతరంతో రకరకాల వాదనలు వినిపిస్తున్నారు.పీఏసీ చైర్మన్ గాంధీ తమ వాడేనని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యనిస్తే… ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మధ్య వివాదంతో తమకేం సంబంధమని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి వంటి వారు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. దీంతో గాంధీ విషయంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటనే చర్చ మొదలైందివరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే గాంధీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ అకౌంట్‌లో స్పష్టంగా తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా గాంధీని పార్టీలో చేర్చుకున్నట్లు ప్రకటన చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా గాంధీ తమ పార్టీ నేతగానే చూస్తున్నామనేలా వ్యాఖ్యలు చేశారు. కానీ, కాంగ్రెస్ మంత్రులు ఇందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు.ఇదే సమయంలో సీఎం, ఆయన సలహాదారు, వివాదానికి కారణమైన ఎమ్మెల్యే గాంధీ అప్పుడు.. ఇప్పుడు ఒకే రకమైన ప్రకటనలు చేయడంతో గాంధీ కాంగ్రెస్ నేతగానే పరిగణించాల్సివుంటుందని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో విపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని గాంధీకి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత… ఎమ్మెల్యేలు గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య వివాదం చెలరేగింది. కోర్టు తీర్పు వచ్చిన నాడే గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించడం ఈ వివాదానికి అసలు కారణం. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల రక్షణకు వారిని ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని భావిస్తున్న కాంగ్రెస్… ఆ గ్రూపులో ఒక ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్‌గా నియమించి… వారు బీఆర్‌ఎస్‌లోనే మరో వర్గంగా కొనసాగుతున్నట్లు చూపాలని భావించిందంటున్నారు.ఈ కారణంతోనే శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు… ఎమ్మెల్యే గాంధీతో తమ పార్టీకి సంబంధం లేనట్లు వ్యాఖ్యానించారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కౌశిక్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిలో ఎమ్మెల్యే గాంధీ తప్పేమీ లేదన్నట్లు చేసిన వ్యాఖ్యలే చర్చనీయాంశంగా మారాయి.కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టడం వల్లే తమవారు అలా వ్యవహరించాల్సివచ్చిందన్నట్లు చెప్పడం ద్వారా గాంధీ తమ వాడేనన్న సంకేతాలు పంపారు సీఎం రేవంత్‌రెడ్డి.. దీంతోనే కాంగ్రెస్‌లో ఏమైనా గందరగోళం కొనసాగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయాలన్న దానిపై అధికార పార్టీలో స్పష్టమైన విధానం తీసుకోలేదా? అనే సందేహిస్తున్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే ఎలా అని కాంగ్రెస్ వర్గాల్లోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
- Advertisement -