కరీంనగర్. జూన్ 21,
సోషల్ మీడియాలో చేసిన ఒక్క పోస్టుతో ఆ మాజీ మంత్రి పార్టీ మారబోతున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. మారడం లేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన బండి సంజయ్ ని అభినందిస్తూ చేసిన పోస్టు ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఆ పోస్ట్ చూసిన కొంతమంది ఆయన బీజేపీలో చేరడం ఖాయం అంటూండగా మరి కొంతమంది మాత్రం సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాలతో కాంగ్రెస్ లో చేరతానని అంటున్నారు. మరి ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తారా? లేదా? అనేది రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.కరీంనగర్ ప్రస్తుత ఎమ్మెల్యే మాజీమంత్రి గంగుల కమలాకర్ పార్టీ మారతారని చర్చలు రాజకీయ వర్గాలలో జోరందుకుంటున్నాయి. కరీంనగర్ లో వరుస విజయాలు నమోదు చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసుకున్నారు గంగుల కమలాకర్. కౌన్సిలర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గంగుల 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 తర్వాత ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ లో చేరారు. వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ హయాంలో కీలక శాఖలకు మంత్రిగా చేశారు. దశాబ్ద కాలంగా కారు పార్టీలోనే జర్నీ చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారు కావడంతో తిరిగి పార్టీ మారతారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తాను వీర విధేయుడ్ని అంటూ చెప్పుకుంటారు. అలాంటిది గంగుల కమలాకర్ పార్టీ మారతారని ప్రచారం జరుగుతుండడంతో క్యాడర్ లో గందరగోళం నెలకొంది. ఇక బిజెపి ఎంపీ బండి సంజయ్.. కంగుల కమలాకర్ ఇద్దరు ఉప్పునిప్పులా ఉంటారు. ఇద్దరి మధ్య చాలా అంశాలలో మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సంజయ్ కి కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రిగా పదవి దక్కడంతో సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ మారతారనే ప్రచారాలు ఎవరికి తోచినట్టు వారు అనువదించుకుంటున్నారు. గంగుల మాత్రం నో కామెంట్స్ అన్నట్టుగా మౌనం పాటిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గంగులకు సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కలిసి పని చేశారు. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో చెరో గూటికి చేరుకున్నారు. సీఎం అయిన తర్వాత గంగుల కమలాకర్ హస్తం గూటికి చేరుతారు అనే ప్రచారం కూడా జోరుగానే జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గంగుల కమలాకర్ కు అడ్డు చెప్పినట్టుగా మరో టాక్ వినిపించింది. అయితే జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇటీవల కరీంనగర్ పర్యటనలో గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లిన కేసీఆర్, కేటీఆర్ పార్టీ మారకుండా నచ్చ చెప్పారని సమాచారం. కమలాకర్ కూడా పార్టీ మారనని స్పష్టత ఇవ్వడంతో కొన్ని రోజులపాటు జరుగుతున్న ప్రచారానికి తెర వేసినట్టు అయ్యింది.అయితే ఈ మధ్యకాలంలో బీజేపీకి అధిక పార్లమెంట్ సీట్లు రావడం.. గంగుల కమలాకర్ సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలపడం రాజకీయ వర్గాలలో కొంతవరకు చర్చనీయాంశంగా మారింది.
కమలం గూటికి గంగుల..?
- Advertisement -
- Advertisement -