నీటి వనరుల వివరాలను జియో ట్యాగింగ్ చేయాలి
హైదరాబాద్ జూన్ 27:
కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ గౌబా గురువారం జలశక్తి అభియాన్పై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులు, కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి వనరుల వినియోగం కోసం శాస్త్రీయ ప్రణాళికలను రూపొందించాలని, వనరుల వివరాలను జియో ట్యాగింగ్ చేయాలని అన్నారు. అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరుల వివరాలను కూడా సిద్ధం చేయాలని అన్నారు. ఉపాధి హామి పథకం, కాంపా, ఫైనాన్స్ కమిషన్ తదితర పథకాల కింద లభించే నిధులను నీటి సంరక్షణ కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా గతేడాది అమృత్ సరోవర్ కార్యక్రమం కింద 75 వేలకు పైగా కొత్త నీటి వనరులను నిర్మించినందుకు ప్రధాన కార్యదర్శులను ఆయన అభినందించారు.
ఈ సంవత్సరం నారీ శక్తి సే జలశక్తి అభియాన్ ఇతివృత్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేసి నీటి నిర్వహణలో వారికి శిక్షణ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాష్ట్రాలను కోరారు. నీటి వినియోగంపై నిర్ణయం తీసుకోవడంలో మహిళల పాత్ర పెరగాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
గ్రామీణ, పట్టణ నీటి సరఫరా కోసం రాష్ట్రాలు సమగ్ర O&M విధానాన్ని రూపొందించాలని ఆయన కోరారు. సరైన క్లోరినైజేషన్ చేసి నాణ్యమైన తాగునీటి సరఫరా జరిగెలా చూడాలని అన్నారు. వర్షపు నీటి సంరక్షణ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని, పట్టణ ప్రాంతాల్లోని నీటి వనరుల ఆక్రమణలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
నీటి వనరులకు ఆధారమైన చెరువులు, కుంటలలో పూడిక తీయటం, శుభ్రపరచడం, భూగర్భజలాల రీఛార్జ్ కోసం పాడుబడిన బోర్వెల్లను పునరుద్ధరించడం, నీటి వనరులను జియో ట్యాగింగ్ చేయడం, పరీవాహక ప్రాంతాలలో అటవీ పెంపకం, చిన్న నదుల పునరుజ్జీవనం వంటివి జలశక్తి అభియాన్లో ప్రధానమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇరిగేషన్ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
నీటి వనరుల వివరాలను జియో ట్యాగింగ్ చేయాలి
- Advertisement -
- Advertisement -