బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రులను పరిశీలించిన గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
తిరుపతి
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రులను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం సందర్శించారు.
ముందుగా బర్డ్ ఆసుపత్రిని సందర్శించి, నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి మరియు ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందుతున్న చికిత్స, ఐసియు, ఔట్‌పేషెంట్ విభాగం, ఆపరేషన్ థియేటర్లు, వార్డులను, డిజిటల్ ఎక్స్‌రే, సిటి స్కాన్, కృత్రిమ అవయవాల తయారీ, అమరిక కేంద్రాన్ని పరిశీలించారు.
అనంతరం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి వార్డుల్లో గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న చిన్నారులను, క్యాథ్‌ల్యాబ్, ఐసీయూ తదితర వార్డులను రాష్ట్ర గవర్నర్ సందర్శించి, రోగుల తల్లిదండ్రులతో మాట్లాడారు. నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.
తరువాత రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ దంపతులను టీటీడీ జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం సాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి రెడ్డప్ప రెడ్డి, శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.