వేసవి సమీపిస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోవడం లేదు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో రోజు విడిచి రోజు జలమండలి 9 మిలియన్ గ్యాలన్ల నీటిని అందిస్తోంది. అక్కడ బోర్లు ఎండిపోవడంతో నీరు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మిషన్ భగీరథకు సరఫరా చేస్తున్న నీటిని మొత్తం నగరానికే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు జలమండలి టెక్నికల్ డైరెక్టర్ ఇటీవలే లేఖ రాశారు. మిషన్ భగీరథ పథకానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని, గోదావరి పథకం నుంచి ఇస్తున్న 40 ఎంజీడీల నీటిని పూర్తిగా నగరానికే కేటాయించనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇటీవలి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ, జలమండలిపై సమీక్ష నిర్వహించారు. గోదావరి జలాలను నగరానికి కేటాయించాలని సూచించడంతో ఈ మేరకు జలమండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోదావరి నుంచి నగరానికి నిత్యం 172 ఎండీలు(721 మిలియన్ లీటర్లు) తరలిస్తున్నారు. ఇందులో 40 ఎంజీడీలను మిషన్ భగీరథకు తరలిస్తున్నారు.