ఖమ్మం, నవంబర్ 27, (వాయిస్ టుడే ): రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. అందులో భాగంగా.. ఖమ్మం జిల్లా ముష్టికుంట్లలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు తెలంగాణ పేదలకు కేసీఆర్ చేసిందేమీ లేదని ఆరోపించారు. ఏం చేయలేని కేసీఆర్ ఎక్కడుంటే ఏం లాభమని ప్రశ్నించారు?. రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన ఇళ్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు జానెడు జాగా కూడా ఇవ్వలేదని విమర్శించారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.. గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్.. కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని అన్నారు. కరెంటును పట్టుకుంటే ఏమవుతుందో.. కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నా అదే అవుతుంది.. కేసీఆర్ మాడిపోతావ్ అని మండిపడ్డారు. మేం ఇచ్చిన హామీలను బరాబర్ అమలు చేసి చూపిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో బీజేపీకి ఓటేస్తోందని భట్టి విక్రమార్క విమర్శించారు.