రాహుల్ గాంధీ ధోరణి మార్పు వచ్చిందా?
డిల్లీ ఫిబ్రవరి 16
Has Rahul Gandhi’s attitude changed?
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ధోరణి ఎట్టకేలకు దారిన పడుతున్నట్లు భావించవచ్చునా? 202627వ సంవత్సరపు బడ్జెట్‌పై ఆయన సభలో ఈ నెల 11న చేసిన ప్రసంగాన్ని బట్టి ఈ ఆశాభావం కలుగుతున్నది. ఆయన నేరుగా బడ్డెట్ ప్రతిపాదనలను చర్చించి ఉండకపోవచ్చుగాక. లేదా మొత్తం మీద బడ్జెట్ తీరుతెన్నులను విశ్లేషించి మంచి చెడులను ఎత్తిచూపకపోవచ్చు. ఆ పని రానున్న రోజులలో కాంగ్రెస్ వక్తలు, ఇతర ప్రతిపక్ష వక్తలు చేయగలరు. కాని, దేశ ఆర్థికంతో సంబంధం గల అమెరికా వాణిజ్య ఒప్పందపు తీరు, అందువల్ల భారత దేశానికి కలిగే నష్టమంటూ తాను భావించే అంశాలను ప్రస్తావించారు. అది ప్రశంసించ దగిన విషయం. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వ్యక్తి చేయవలసిని పనే ఇది అయినపుడు తనను ప్రత్యేకంగా అభినందించటం ఎందుకని. ఎందుకంటే, రాహుల్ గాంధీ ఆ స్థానం నుంచి పార్లమెంటులో గాని, కాంగ్రెస్ నాయకునిగా బయట గాని తను చేయవలసిన పనులు అరుదుగా తప్ప చేయటం లేదు. చేయటం లేదన్న మాట స్వయంగా కాంగ్రెస్ వాదులకు, కాంగ్రెస్ నాయకత్వాన గల ప్రతిపక్ష కూటమి వారికి, అధికార పక్షమైన బిజెపికి, బయట సాధారణ ప్రజలకు కూడా అర్థమైంది. అందుకు అందరూ విసుగు పడుతుండగా బిజెపి సంతోషిస్తున్నది. ఆయన నాయకునిగా ఉన్నంతకాలం తమ అధికారానికి ముప్పు లేదని వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌లోనూ అసంతృప్తి పెరుగుతున్న స్థితిలో, పార్టీ నాయకునిగా రాహుల్‌ను తప్పించి ప్రియాంకకు బాధ్యతలు అప్పగించటం వల్ల ప్రయోజనం ఉండవచ్చుననే మాటలు ఇటీవల తిరిగి వినవస్తున్నాయి. మిగిలిన వారిని అట్లుంచి సాక్షాత్తూ ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అటువంటి సూచన చేయటం తగినంత కలకలాన్ని సృష్టించింది. ఎవరైనా తాము చేయవలసినది చేయకుండా తక్కినవి ఎంత బాగా చేసినా దానిని లోకం మెచ్చదు. రాహుల్ అదే పని చేస్తూ వచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలనే ముందుగా తీసుకుంటే, ఆయన మాజీ సైన్యాధిపతి జనరల్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలోని అంశాలతో భూకంపం సృష్టించాలని చూసారు. అందులో గల్వాన్ ఘటనల గురించిన ప్రస్తావన తప్పక చర్చించదగినదే. దానిపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నది మొదటనే స్పష్టమైంది. ఒక కారణం, అది ఇంకా అధికారికంగా వెలువడ లేదు. రెండవది, గల్వాన్ ఉదంతం సందర్భంగా ‘ఏది ఉచితమని భావిష్తే అది చేయండి’ (జో ఉచిత్ సమ్‌ఝే వో కరో) అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అప్పటి సైన్యాధిపతితో చెప్పారంటున్న మాటకు పలు విధాలైన నిర్వచనాలను వింటున్నాము. వాటిలో తను భావించిన నిర్వచనం ఏమిటో ఆ అధికారి పేర్కొనలేదు. ఇపుడు ప్రభుత్వమూ ఆ చర్చకు సిద్ధంగా లేదు. అటువంటి స్థితిలో రాహుల్ గాంధీ ఎంత సేపని, ఎన్ని రోజులని సభా సమయాన్ని అందుకోసం ఉపయోగించగలరు? +విషయమేమంటే, ప్రతిపక్ష స్థానంలో కాంగ్రెస్ ఒక్కటే లేదు. వారి కూటమిలో, కూటమికి బయట ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. నరవణె పుస్తకం విషయమై వారికి కూడా ఆందోళన ఉన్నా, సభా సమయం యావత్తూ రోజుల తరబడి అందుకే ఖర్చు కావటం వారికి నచ్చలేదు. తాము మాట్లాడదలచుకున్నవి తమకున్నాయి. పైగా ఇవి బడ్జెట్ సమావేశాలు. ఆ దృష్టా రాహుల్ ధోరణి వారికి నచ్చలేదని, అంతర్గతంగా ఆయనపై విమర్శలు మొదలయ్యాయని వార్తలు సూచించాయి. ఆయన బుధవారం నాడు నరవణె విషయం వదలి వేసి బడ్జెట్ గురించి మాట్లాడటానికి కారణం అదేనని భావించవలసి వస్తున్నది. వాస్తవానికి దేశానికి కావలసింది ప్రధానంగా బడ్జెట్ గురించిన చర్చ. 2020 నాటి గల్వాన్ గురించి నోటీసు ఇచ్చి మరొక సందర్భంలోనైనా చర్చించవచ్చు. బడ్జెట్ చర్చను ఆపి మరీ అందుగురించి చర్చించవలసిన అత్యవసర స్థితి ఏమీ లేదు. ఆ మాట రాహుల్ గాంధీకి స్వయంగా అర్థ్ధం కాలేదు. తన ధోరణిపట్ల ఇతర ప్రతిపక్షాల నిరసనతో బోధ పడింది. ఆ విధంగా ఆయన ధోరణీ ఆ వత్తిడి వల్ల దారిన పడిందన్న మాట. రాజ్యాంగ దుమారం విశేషమేమంటే తను గతంలోనూ ఇదే విధంగా వ్యవహరించారు కొన్ని సార్లు. తనకు సరైనదని తోచిన సంచలనాత్మక విషయమేదో ముందుకు తెస్తారు. దానిని ప్రస్తావించటంతో ఆగక రోజుల తరబడి సభలోనూ బయటా హంగామా సృష్టిస్తారు. ఇతర ప్రతిపక్షాలకూ, బయటినుంచి టివిలలో చూసే ప్రజలకూ విసుగు తెప్పిస్తారు. ఇతర ప్రతిపక్షాల వత్తిడి మీదట ధోరణి మార్చుకుంటారు. ఆయనకు ఇదొక అలవాటుగా మారింది. మనం ఇరవై ఏళ్లుగా గమనిస్తున్న తన నాయకత్వంలోని అనేక లోపాలలో ఇది ఒకటి. సభలోనే కాదు. ఇతర విషయాలలోనూ అంతే. ప్రజల సమస్యలు, వారు తన నుంచి ఆశించేది ఒకటైతే, ఆయన మరేవో భుజాన వేసుకుంటారు. అవి ప్రజలకు పట్టవు. ఇటీవలి కాలానికేవస్తే, కాంగ్రెస్ అసెంబ్లీ సీట్లు మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్‌లలో గతం కన్న తగ్గింది ఎందుకు? ఆ కారణాలను ఆయన సమీక్షించుకున్నారో లేదో తెలియదు గాని, బయటి వారికి అర్థమవుతూనే ఉన్నాయి.



