ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 27,
He avoids Revanth Reddy
తెలంగాణలోని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ జరిగే వరకూ తాము ఊరుకోబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రైతులు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. రైతు రుణమాఫీతో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేసే వరకూ సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనివ్వమని.. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పారు. దసరా లోపు పూర్తిగా రుణమాఫీ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ పాలనకు మధ్య తేడా రైతులందరికీ అర్థమైందని హరీష్ రావు అన్నారు. ‘రైతులను ఎరువు బస్తాల కోసం లైన్లో నిలబెట్టింది కాంగ్రెస్. కేసీఆర్ ప్రతి ఊరికి ఎరువులను లారీల్లో పంపి అందించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలకుండా కడుపునిండా రైతులకు కరెంటు ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో దొంగ రాత్రి కరెంట్ వచ్చేది. మళ్లీ కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు కనిపిస్తున్నాయి. కరోనా వచ్చినప్పుడు కూడా రైతులకు రైతు బంధు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో పంట పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన తర్వాతే రైతుల భూముల విలువలు పెరిగాయి. కాంగ్రెస్ వచ్చి రైతు విలువ తగ్గించింది.’ అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే.. చేతలు గడప కూడా దాటడం లేదని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం కూలిపోయిందని రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని.. ప్రాజెక్టులోని వంద భాగాల్లో ఒక్క భాగానికి సంబంధించి రెండు పిల్లర్లు కూలితే కాళేశ్వరమే కూలిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పంద్రాగస్టు వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మొదలు రూ.49 వేల కోట్లు మాఫీ చేస్తామన్నారు. తర్వాత రూ.31 వేల కోట్లు అన్నారు. రూ.17 వేల కోట్లు మాత్రమే చేశారు. రాష్ట్రంలో సుమారు 21 లక్షల మంది అన్నదాతలకు రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డిది అంతా మోసం అన్నీ అబద్ధాలే. ఆయన పేరు ఎనుముల రేవంత్ రెడ్డి, ఆయన పనులు చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి.’ అని మండిపడ్డారు.నిర్మాణం బీఆర్ఎస్ పార్టీ విధానమని.. కాంగ్రెస్‌ది విధ్వంసం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాము నిర్మిస్తే.. కాంగ్రెస్ కూల్చేస్తుందని మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలు, డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బీఆర్ఎస్‌ది నిర్మాణం. కాంగ్రెస్‌ది విధ్వంసం. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేదని మభ్యపెట్టారు. మేం కట్టిన ఇళ్లనే మూసీ బాధితులకు కేటాయిస్తున్నారు. రాత్రికి రాత్రే లక్ష ఇళ్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి.?. మహానగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాం. కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్ధాలు అనడానికి మరో సాక్ష్యమిదే.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.