హైదరాబాద్, డిసెంబర్ 12, (వాయిస్ టుడే): న్యూ ఇయర్ వేడుకను చాలామంది వివిధ రూపాల్లో ఆస్వాదిస్తూ ఉంటారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడరు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తీరే వేరు కదా. కాస్మో పాలిటన్ సిటీగా ఎదిగిన తర్వాత ఇక్కడ రకరకాల సంస్కృతులు విలసిల్లుతున్నాయి.. అయితే ఇదే అదునుగా కొంతమంది న్యూ ఇయర్ వేడుకలను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. అయితే దీనికోసం వారు ఎంచుకున్న మార్గమే చట్ట వ్యతిరేకం. ఇంకేముంది పోలీసులకు దొరికిపోయారు. ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. ఇంతకీ వారు చేసిన దారుణం ఏంటంటే..నూతన సంవత్సర వేడుకల్లో మద్యం భారీగానే అమ్ముడు పోతుంది. అయితే మద్యానికి మించి కిక్కు కోరుకునే వారు మాత్రం మాదకద్రవ్యాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇందులోనూ రకరకాల మాదకద్రవ్యాలు ఉంటాయి. అయితే అలా నూతన సంవత్సర వేడుకల కోసం సరఫరా చేసేందుకు మాదకద్రవ్యాల ను తయారు చేస్తున్న ఒక ముఠాను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. వారు చేస్తున్న కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఏకంగా మూడు కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో విస్తు పోయే వాస్తవాలు కళ్లకు గట్టాయి. హైదరాబాదులో మాదకద్రవ్యాలు అనేది కొత్త కాకపోయినా.. ఇన్నీ రోజులపాటు మాదకద్రవ్యాలను ఇతర ప్రాంతాలనుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవారు. అయితే ఇప్పుడు కొందరు హైదరాబాదులోనే తయారీకి తెర లేపారు. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో, సంగారెడ్డి పరిధిలోని పారిశ్రామిక వాడల్లో మూతపడిన పరిశ్రమలను ఎంచుకొని వాటిల్లో అత్యంత రహస్యంగా మాదకద్రవ్యాలను సిద్ధం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ దందా కొనసాగుతోంది. అయితే దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగారు.సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలో మూతపడిన పరిశ్రమలలో గుట్టుగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. వీటికోసం రకరకాల రసాయనాలు వినియోగిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోలీస్ అధికారులు ఆ మూతపడిన పరిశ్రమలపై దాడి చేసి డ్రగ్స్ తయారీ కోసం వాడుతున్న రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తయారు చేస్తున్న వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సరుకు విలువ మూడు కోట్ల దాకా ఉంటుందని సమాచారం. గతంలో ఈ ముఠా సభ్యులు ఇలాగే మూతపడిన పరిశ్రమలో డ్రగ్స్ తయారుచేసి అధికారులకు చిక్కారు. జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం ఇలా డ్రగ్స్ తయారుచేసి హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. జిన్నారం మాత్రమే కాకుండా నాచారం పారిశ్రామిక వాడలోనూ ఇదే తీరుగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది.. అయితే ఈ డ్రగ్స్ తయారీ వెనుక చెన్నైకి చెందిన నెపోలియన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో పోలీసు అధికారులు అరెస్ట్ చేసిన స్మగ్లర్లతో వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే న్యూ ఇయర్ వేడుకలకు ముందే పోలీసులు ఈ డ్రగ్స్ రాకెట్ ను చేదించిన నేపథ్యంలో.. గతంలో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన వారంతా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది