అంతరిక్షంలో చెత్తను వదిలేసినందుకు డిష్ నెట్‌వర్క్ కంపెనీకి అమెరికా ప్రభుత్వానికి చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ 1,50,000 డాలర్ల అనగా రూ.1.24 కోట్లు జరిమానా విధించింది. అంతరిక్షంలో ప్రమాదకరమైన చెత్త వదిలినందుకు ఇలా జరిమానా విధించడం అమెరికాలో ఇదే మొదటిసారి. డిష్ నెట్‌వర్క్ కంపెనీ 2002లో ఎకోస్టార్–7 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేరుకున్న ఈ ఉపగ్రహం కాలపరిమితి 2022లో ముగిసింది. నిరుపయోగంగా మారిన ఉపగ్రహాన్ని కక్ష్య నుంచి 299 కిలోమీటర్ల దూరం పంపించాల్సి ఉంది. 122 కిలోమీటర్లు వెళ్లాక ఇంధనం నిండుకోవడంతో అక్కడే ఆగిపోయింది. ప్రస్తుతం భూమిచుట్టూ పరిభ్రమిస్తోంది. ఇతర ఉపగ్రహాలకు ప్రమాదకరంగా మారింది. అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాలను చెత్తగానే పరిగణిస్తారు. 1957 నుంచి ఇప్పటిదాకా 10 వేలకుపైగా శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించారు. వీటిలో సగం శాటిలైట్లు పనిచేయడం లేదు.