భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: సీపీ వీసీ సజ్జనర్
Heavy rains… People must remain alert: CP VC Sajjanar
హైదరాబాద్, జూలై 30 (వాయిస్ టుడే): నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. వాతావరణ కేంద్రం జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వర్ష సూచనలకు అనుగుణంగా రోజువారీ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని కోరారు.
వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గురువారం పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులను సీపీ స్వయంగా పరిశీలించారు. వాహనాల రాకపోకలను సమీక్షించి, విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
నగరంలో వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పనిచేస్తోందని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పారు.
వర్షం సమయంలో తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అలాగే నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు, ఫ్లైఓవర్ల వద్ద వాహనదారులు వేగాన్ని తగ్గించి అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు.
వాతావరణ కేంద్రం మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో, అత్యవసర పరిస్థితులు మినహా వర్షం పడుతున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో లేదా ట్రాఫిక్ సహాయం కోసం డయల్–100ను సంప్రదించాలని సూచించారు. నగర ట్రాఫిక్ పోలీసు శాఖ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేసే ట్రాఫిక్ అడ్వైజరీలను తప్పనిసరిగా పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సీపీ వీసీ సజ్జనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




