కంచుకోటలో పట్టు నిలిపేనా
మెదక్, మే 6 (వాయిస్ టుడే )
మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో గత ఐదు ఎన్నికల్లలో ఓటమి ఎరుగని భారత రాష్ట్ర సమితికి, ఓటమి రుచి చూపించే శక్తీ కాంగ్రెస్పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఉందా? అని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కొంత బలహీనంగా కనపడుతున్నా, ఇప్పటికీ బీఆర్ఎస్ కు మెదక్ లోక్ సభ నియోజకవర్గ పరిధి ఒక కంచుకోటే అంటున్నారు. దాన్ని ప్రతిబింబిస్తూనే, గత అసెంబ్లీ ఎన్నికలలో ఈ లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకర్గాలలో, ఆరు గెలుచుకుని తన పట్టు నిలుపుకుంది. అయితే, బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ విజయకాశాలకు పెద్ద విఘాతంగా మారింది. అయినా, ఇప్పటికీ మెదక్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పి.వెంకట్రామి రెడ్డి గెలవటానికి మంచి అవకాశాలే ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ విజయావకాశాలు దెబ్బ తీయటానికి సకల ప్రయత్నాలు చేస్తుంది. అన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లను, క్యాడరును తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. మెదక్ లోక్ సభ పరిధిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మాజీ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి , భూమి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ వంటి బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరటం, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగానే చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. దాంతోపాటు, కాంగ్రెస్ పార్టీ మరికొంత మంది బీఆర్ఎస్ పార్టీ నాయికలను కూడా, తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. సీనియర్ నాయకులు తూర్పు జగ్గా రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన విజయం కోసం సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.మరొకవైపు, బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, హిందూ ఓట్లపైన ఆశలు పెట్టుకుని పనిచేస్తున్నారు. సిద్దిపేటలో, అమిత్ షాతో బహిరంగ సభ ఏర్పాటు చేయించిన రఘునందన్ రావు, మెదక్ జిల్లాలోని అల్లాదుర్గంలో నరేంద్ర మోడీ సభ కూడా తనకు అనుకూలంగా మారుతుందని ఆశావహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎంత బలహీనంగా మారినా, మెదక్ జిల్లా సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావటం, మాజీ మంత్రి హరీశ్ రావు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, బీఆర్ఎస్ పార్టీని ఓడించడం అంత తేలికకాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో, మెదక్ లోక్ సభ నియోజకవర్గం ప్రాంతం, సభలతో, నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తిపోతుంది.
మెదక్ కంచుకోటలో పట్టు నిలిపేనా
- Advertisement -
- Advertisement -