ఇంటి వంట ముద్దు..
బయట ఫుడ్డు వద్దు..
న్యూట్రిషన్, హెల్తీ ఫుడ్ కు ప్రాధాన్యం ఇవ్వండి
జంక్ ఫుడ్ తో అనర్ధాలు అధికం
వంటల్లో మగవారు సాయపడాలి
కరీంనగర్
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
రెవెన్యూ గార్డెన్ లో మగవారికి వంటల పోటీలు
ప్రతిభ చూపిన వారికి బహుమతుల అందజేత
ఇంట్లోనే తయారు చేసుకున్న హెల్తీ, న్యూట్రిషన్ ఫుడ్ కు అందరూ ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బయట దొరికే జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల అధిక అనర్ధాలు ఉంటాయని తెలిపారు. బుధవారం కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషన్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా మగవారికి వంటల పోటీలు నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై వంటకాలను రుచి చూశారు. మగవారు చాలా బాగా వంటలు చేశారని అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫాస్ట్ గా లభించే ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవద్దని, వాటి వల్ల చాలా అనర్ధాలు, ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఇంట్లోనే హెల్తీ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ ను తయారు చేసుకొని తినాలని సూచించారు. సంప్రదాయ వంటకాలపై అధిక దృష్టి సారించాలని, వాటితోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు వంటల్లో మగవారు కొంత సాయం చేయాలని సూచించారు. మన ఆరోగ్యంలో మనం తీసుకున్న ఆహారమే కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మహిళలకు దీటుగా మగవారు వంటలు చేయడం నేర్చుకోవాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ మహిళలు పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని పేర్కొన్నారు. కూరగాయలు ఆకుకూరలతో పాటు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు.
వంటల పోటీల్లో కొత్తపెల్లి సెక్టార్ పరిధిలోని ఆసిఫ్ నగర్ -4 అంగన్వాడీ సెంటర్ కు ప్రథమ బహుమతి లభించింది. సురేష్ వెన్నెల దంపతులు, ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ, అంగన్వాడీ టీచర్ మెంగాని పద్మలకు జిల్లా కలెక్టర్ బహుమతి అందజేశారు.
దీంతోపాటు పలువురికి జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్, అధికారులు, బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, సిడబ్ల్యూసి చైర్ పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, డీఈవో జనార్దన్ రావు, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు, కరీంనగర్ రూరల్ సిడిపిఓ సబిత, అర్బన్ సిడిపిఓ లక్ష్మీనారాయణ, గంగాధర సిడిపిఓ కస్తూరి, అధికారులు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది సంఖ్యలో పాల్గొన్నారు.