బషీర్‌బాగ్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు తదితర అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాత్రికేయుల ఇళ్ల స్థలాల విషయమై త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో అకాడమీ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని దీనిపై తనతో చర్చించారన్నారు. ముఖ్యమంత్రి సీపీఆర్‌వో అయోధ్యరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర మీడియా అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ మాట్లాడారు..