అందరూ జైలుకు పోతే మనుగడ ఎలా జగనన్నా…!!!
How can we survive if everyone goes to jail…!!!
వైసీపీలో వార్నింగ్ గంటలు మోగుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా అరెస్టు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయి జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు బెయిల్ కూడా రాలేదు. వచ్చే అవకాశం కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇక, ఇప్పుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్టయ్యాయి. ఆయనకు కూడా ఇప్పట్లో బెయిల్ దక్కే ఛాన్స్ లేదు. దీనికి కారణం.. ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. ఏసీబీ కేసుల్లో కనీసంలో కనీసం మూడు నెలల వరకు జైల్లో ఉండే సెక్షన్లే ఉంటాయి. వాటికి బెయిల్ కూడా దక్కే అవకాశం లేదు. అందుకే రాజీవ్ అరెస్టయి రెండు రోజులు గడిచినప్పటికీ.. బెయిల్ కోసం ప్రయత్నాలు చేయలేకపోయారు. ఇక, జోగి అరెస్టు కూడా రెడీ అయిందనే వార్తలు వస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయొద్దంటూ.. హైకోర్టు ఆదేశించింది. ఇది తేలిపోతే.. జోగి ఎప్పుడు ఏ క్షణంలో అయినా అరెస్టు అయ్యే అవకాశం ఉంది. ఇక, మరోవైపు టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఎమ్మెల్సీలు .. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్, యువ నాయకుడు దేవినేని అవినాశ్ లపైనా కేసులు నమోదయ్యాయి. వీరు కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. వీరికి ప్రస్తుతానికి కోర్టు నుంచి రక్షణ ఉన్నప్పటికీ.. అది ఎగిరిపోతే.. ఏ క్షణమైనా వారిని అరెస్టు చేసేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడు భూముల విషయంలో కూటమి ప్రభుత్వం రీసర్వే లోపాలను వెలికి తీస్తోంది. దీనికి పెద్ద స్కెచ్చే ఉందని తెలుస్తోంది. అప్పటి రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాద రావును అరెస్టు చేయించాలనేది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. అదేవిధంగా వల్లభనేని వంశీపైనా కేసులు ఉన్నాయి. ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది కూడా విచారణలో ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. కీలక నాయకులు, ముఖ్యంగా వైసీపీకి అత్యంత బలమైన వాయిస్ వినిపించే నాయకుల అరెస్టు ఏ క్షణమైనా జరగొచ్చు. దీని నుంచి పార్టీని కాపాడుకుంటే తప్ప.. జగన్‌కు మనుగడ కష్టంగా మారే అవకాశం ఉంది.