ఐటీ కారిడార్‌లో రూ.1,000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
Hydra saves Rs 1,000 crore government land in IT corridor
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో ఉన్న 5 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా మంగళవారం ఆక్రమణదారుల నుంచి రక్షించింది. ఐటీ కారిడార్ ప్రాంతంలో ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ.1,000 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సర్వే నంబర్ 42లో, మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న ఈ భూమిని కొందరు అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. రెండు తాత్కాలిక షెడ్లు, ఒక గదిని నిర్మించడంతో పాటు 5 ఎకరాల చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ నిర్మించే పనులు చేపట్టారు.
ఈ విషయంపై రెవెన్యూ శాఖ నుంచి ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ భూమిని తమదిగా చెబుతూ ఇతరులను అటువైపు రానీయకుండా అడ్డుకుంటున్నారని అధికారులు గుర్తించారు.
శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా చర్యలు చేపట్టి, అక్కడ ఏర్పాటు చేసిన రెండు తాత్కాలిక షెడ్లు, నిర్మించిన గది, ఫెన్సింగ్‌ను తొలగించింది. అనంతరం మొత్తం 5 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా కొత్త ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఇది ప్రభుత్వ భూమి అని తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేసింది.
ఐటీ కారిడార్‌లో అత్యంత విలువైన ఈ భూమిని ఆక్రమణల నుంచి రక్షించడం ద్వారా ప్రభుత్వ ఆస్తిని కాపాడినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.




